బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను వ్యతిరేకించడాన్ని తప్పుపట్టిన అమిత్ షా

Telugu Lo Computer
0


బీహార్ లోని సీతామర్హి లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగిస్తూ బీహార్‌లో ప్రతిపక్ష పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లపై అమిత్ షా విరుచుకుపడ్డారు. చొరబాటుదారులు వారి ఓటు బ్యాంకు అని, అందుకే ప్రతిపక్ష పార్టీలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని వ్యతిరేకిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ దేశంలో మొదటి సారి జరగడం లేదని, ఈ విధానాన్ని మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారని కేంద్ర మంత్రి చెప్పారు. 'బీహార్‌లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. నేను ఇక్కడికి వచ్చేముందు నన్ను విలేకర్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అయితే, దీని గురించి నేను ప్రజలను అడగాలనుకుంటున్నాను. మనం ఓటర్ల జాబితా నుండి వలసదారులను తొలగించకూడదా? లాలూ ప్రసాద్ యాదవ్ ఎవరిని రక్షించాలనుకుంటున్నారు? బయటి నుండి వచ్చి బీహార్ ప్రజల ఉద్యోగాలు లాక్కునే బంగ్లాదేశీయులను మీరు రక్షించాలనుకుంటున్నారా?' అంటూ అమిత్ షా ఆర్జేడీ టార్గెట్ గా ప్రశ్నలు సంధించారు. అటు, కాంగ్రెస్ పైనా అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'రాహుల్ గాంధీ ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను ఆపాలి. SIR దేశంలో మొదటిసారి జరగడం లేదు.. దీనిని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇది 2003లో కూడా జరిగింది. వీళ్లంతా బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలను వెతుక్కుంటున్నారు' అని అమిత్ షా అన్నారు. 'బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలా వద్దా? భారతదేశంలో పుట్టని వారికి భారత రాజ్యాంగం ఓటు హక్కు ఇవ్వదు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాడు.. అయితే, ఆయన దానిని తెరిచి చదవాలి.' అని అమిత్ షా చురకలంటించారు. చొరబాటుదారులు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకు కాబట్టే వాళ్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ మెజారిటీతో బీహార్‌లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష ఇండియా  బ్లాక్ సవరణ ప్రక్రియ పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపుకు దారితీస్తుందని ఆరోపిస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలు బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)