దగ్ధమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు

Telugu Lo Computer
0


విశాఖపట్నంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అల్ట్రా పల్లెవెలుగు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి గాయాలు గానీ, ప్రాణాపాయ పరిస్థితులు గానీ సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్ నంబర్ ఏపీ 31 జెడ్ 0254. సర్వీస్ నంబర్ 111 వీ. ఈ ఉదయం విశాఖపట్నం నుంచి విజయనగరానికి బయలుదేరింది. ఆ సమయంలో బస్సులో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. సాధారణంగా ఈ బస్సుల పూర్తిస్థాయి సీటింగ్ సామర్థ్యం.. 65. దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఇందులో ఎక్కారు. బస్టాండ్ నుంచి బయలుదేరిన ఈ బస్సు కూర్మన్నపాలెం చేరుకోగానే అగ్నిప్రమాదానికి గురైంది. తొలుత పొగ వెలువడింది. ఓ ఆటో డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించాడు. వెంటనే బస్ డ్రైవర్ రమేష్ ను హెచ్చరించాడు. దీంతో అక్కడికక్కడే డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. కండక్టర్ సాయిబాబాతో కలిసి ప్రయాణికులను వెంటనే కిందికి దించాడు. ఆ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటల బారిన పడి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను సర్వీస్ రోడ్ కు మళ్లించారు. ఈ ఘటనకు ఓవర్ లోడ్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో 130 మంది ప్రయాణికులు ఉన్నారని కండక్టర్ సాయిబాబా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)