టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదు : అమెరికన్ గ్లోబల్ రేటింగ్ సంస్థ ఫిచ్

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50 శాతం టారిఫ్‌లు విధించినప్పటికీ, అది భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కావడమే దీనికి ప్రధాన కారణమని అమెరికన్ గ్లోబల్ రేటింగ్ సంస్థ ఫిచ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫిచ్ సంస్థ భారత్ రేటింగ్‌ను బీబీబీ వద్ద కొనసాగించింది. ఫిచ్ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వృద్ధి రేటు, విదేశీ పెట్టుబడులు, బలమైన ఆర్థిక విధానాల కారణంగా ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉంది. ఫిచ్ అంచనా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుంది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో సమానంగా ఉంటుంది. ఈ స్థిరమైన వృద్ధి కారణంగా ట్రంప్ విధించాలనుకుంటున్న సుంకాలు భారత్ ఎదుగుదలను పెద్దగా ప్రభావితం చేయలేవని ఫిచ్ పేర్కొంది. ట్రంప్ విధించాలనుకుంటున్న టారిఫ్‌ల ప్రభావం గురించి ఫిచ్ స్పష్టమైన కారణాలను వివరించింది. భారత్ నుండి అమెరికాకు జరిగే ఎగుమతుల విలువ మొత్తం భారత జీడీపీలో కేవలం 2 శాతం మాత్రమే. ఈ కారణంగా 50 శాతం టారిఫ్‌లు విధించినప్పటికీ, అది భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రత్యక్ష ప్రభావం చూపదు. దీనితో పాటు ప్రభుత్వం ప్రతిపాదించిన వస్తువులు, సేవల పన్ను సంస్కరణలు ఆర్థిక వృద్ధికి సంబంధించిన కొన్ని ప్రమాదాలను తగ్గిస్తాయని ఫిచ్ తెలిపింది. ద్రవ్యోల్బణం విషయంలో కూడా ఫిచ్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. కోర్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 2-6 శాతం పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో 2025లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఫిచ్ అంచనా వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)