తెలంగాణలోని మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు అక్రమ సరోగసీ & ఎగ్ ట్రేడింగ్ సెంటర్ ముఠాగుట్టు రట్టు చేశారు. ఇటీవల సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ద్వారా డాక్టర్ నమ్రత పిల్లల కోసం ఎంతో మంది జంటలను మోసం చేసిన ఘటన మరువక ముందే అలాంటి మరో ముఠాను వైద్యారోగ్య శాఖ, పోలీసులు గుర్తించారు. మాదాపూర్ కేంద్రంగా పిల్లలు లేని జంటల ఆవేదనను డబ్బు కోసం వాడుకున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్‌లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మిరెడ్డి @ లక్ష్మి, గతంలోనే ఎగ్ డోనర్, సరోగేట్ మదర్‌గా పనిచేసిందని తెలిపారు. ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ఈ అక్రమ వ్యాపారంలో తల్లికి తోడుగా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను ఎగ్ డోనర్ లేదా సరోగేట్ మదర్‌గా చేయించి, లక్ష్మిరెడ్డి గ్యాంగ్ భారీ లాభాలు పొందింది. ఈ క్రమంలో, పోలీసులు నిందితుల వద్ద నుండి నగదు, ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, సిరంజీలు, గర్భధారణ మందులు, స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో లక్ష్మీ నిందితురాలని పోలీసులు గుర్తించారు. సృష్టి ఫర్టిలిటీ హాస్పిటల్ ఉదంతంతో నగరంలో నకిలి ఫర్టిలిటీ సెంటర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో సరోగసి, ఐవీఎఫ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న తల్లీకొడుకును అదుపులోకి తీసుకున్నారు. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, మరియు బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మి రెడ్డి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి సుచిత్ర, పద్మా నగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ అక్రమంగా సరోగసీ & ఎగ్ ట్రేడింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి పిల్లలు లేని మహిళలను తీసుకువచ్చి, తన ఇంట్లో ఉంచి, సరోగసీ IVF పద్ధతి ద్వారా గర్భం దాల్చేలా చేసి, చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన నరేందర్ రెడ్డి, తల్లికి తోడుగా ఈ అక్రమ క్లినిక్ నడపడంలో సహకరించాడు. లక్ష్మి రెడ్డికి గతంలోనే ఎగ్ డోనర్, సరోగేట్ మదర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో, మాదాపూర్‌కు చెందిన హెగ్డే, లక్స్ ఆసుపత్రులతో సంబంధాలు పెంచుకుని ఈ రహస్య క్లినిక్‌ను నడిపినట్లు వైద్యారోగ్య శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు నిందితులైన తల్లి కొడుకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ₹6.47 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, సిరంజీలు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, 5 స్మార్ట్‌ఫోన్లు, 1 కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సహకరించిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పేట్ బషీరాబాద్‌లో అక్రమ సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ గుట్టురట్టు !
August 15, 2025
0
Tags