మహారాష్ట్ర అసెంబ్లీలో మొబైల్ ఫోన్‌లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మంత్రి మాణిక్‌రావ్ కోకాటేను కీలకమైన వ్యవసాయ శాఖ నుంచి తప్పించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ బాధ్యతలు అప్పగించడం మరోసారి సంచలనంగా మారింది. ఇకపై మంత్రులెవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పే ప్రయత్నం చేశారు సీఎం ఫడ్నవీస్. అయితే వ్యవసాయ శాఖ నుంచి తప్పించాక కోకాటేకు క్రీడా శాఖ, యువత సంక్షేమ శాఖను కట్టబెట్టడంతో సెటైర్లు పేలుతున్నాయి. కోకాటే శాఖను మారుస్తూ ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ శాఖను మరో ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణేకు అప్పగించారు. దత్తాత్రేయ ఇప్పటివరకూ నిర్వహించిన క్రీడా శాఖను కోకాటేకు ఇచ్చారు. మంత్రి కోకాటే మొబైల్‌లో రమ్మీ ఆడుతున్న వీడియోను తొలుత ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ నెట్టింట పంచుకోవడంతో వివాదం మొదలైంది. సభా కార్యకలాపాలు జరుగుతుండగా మంత్రి రమ్మీ ఆడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వానాకాలంలో రైతు సమస్యలు ప్రధాన ఎజెండా జరుగుతున్న చర్చపై మంత్రి దృష్టిపెట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పాలక పక్షంపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. మంత్రి కోకాటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి చర్యలు బాధ్యతారహితం, అవమానకరమని మండిపడింది. వివాదం ఇంతలా ముదిరినా కూడా మంత్రి రాజీనామా చేయలేదు. ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ శాఖకు బదులు మరో శాఖ బాధ్యతలు అప్పగించింది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలకు దిగిందంటూ మరోసారి ప్రతి పక్షం విరుచుకుపడుతోంది. రమ్మీని రాష్ట్ర క్రీడాగా ప్రకటించాలని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నేత అంబాదాస్ దాన్వే సెటైర్ పేల్చారు. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలను కార్డ్స్ తీసుకెళ్లనివ్వాలని ఎద్దేవా చేశారు. గతంలోనూ కోకాటే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. రైతుల కష్టాలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇక రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొన్న తరుణంలో కోకాటే తనకేమీ పట్టనట్టు ఏకంగా అసెంబ్లీలోనే రమ్మీ ఆడటంపై విమర్శలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంత చేసినా ఆయనకు మంత్రి పదవి నిలబడటం ఏమిటని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కోకాటేను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడా శాఖ అప్పగించిన సీఎం ఫడణవీస్
August 01, 2025
0
Tags