వచ్చే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి : వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి, అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం, ప్రాణ, ఆస్తి, పశుసంపద నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులు, గొర్రెలు, మేకల కాపరులు వాగుల్లో చిక్కుకోకుండా ముందుగానే అప్రమత్తం చేయాలని, ఎప్పటికప్పుడు స్థానిక సమాచారాన్ని సేకరించి, పరిస్థితులను అంచనా వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రెండు గంటల్లోనే భారీ వర్షాలు కురుస్తున్న ఉదాహరణలు ఉన్నందున, ప్రతి సమస్యపై నిరవధిక సమాచార మార్పిడి ఉండాలని సీఎం అన్నారు.  హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నీటి ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ట్రాఫిక్‌ను మళ్లించాలని, రోడ్లపై వీలైనంత తక్కువ ట్రాఫిక్ ఉండేలా చూడాలని, మీడియా భయానక వాతావరణం సృష్టించకుండా, నిజమైన సమాచారం మాత్రమే అందించాలని అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)