42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ అంబేద్కర్, ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు, తెలంగాణ జాగృతి శ్రేణులు తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ''తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాలి, ఆర్థిక అవకాశాలు రావాలి. సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం భాజపా మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది. బీసీ బిల్లుపై భాజపా లేవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాలి. ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వాలి. ముస్లింలను మినహాయించి బీసీలకే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పాలి. అప్పుడు భాజపా ఎందుకు ఒప్పుకోదో మేమూ చూస్తాం. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌కు ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలి'' అని కవిత అన్నారు.
ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టిన ఎమ్మెల్సీ కవిత
August 04, 2025
0
Tags