'3ఎం' ఫార్ములాతో భారత్‌- చైనా సంబంధాలు ముందుకు సాగాలి !

Telugu Lo Computer
0


రస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలతో భారత్‌- చైనా సంబంధాలు ముందుకు సాగాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీతో సమావేశమైన  సందర్భంగా జైశంకర్‌ ఈమేరకు వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య విభేదాలనేవీ వివాదాలుగా మారకూడదని పేర్కొన్నారు. ''భారత్‌, చైనా  మధ్య సంబంధాల్లో ఇటీవల క్లిష్ట పరిస్థితులను చూశాం. ఇప్పుడు రెండు దేశాలు కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. దీనికి ఇరుపక్షాల నుంచి నిజాయతీ, నిర్మాణాత్మక సహకారం అవసరం. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలతో భాగస్వామ్యం ముందుకు సాగాలి. మన మధ్య విభేదాలనేవి.. వివాదాలు, పోటీ, ఘర్షణగా మారకూడదు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని సంయుక్తంగా నెలకొల్పడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతల తగ్గింపు ప్రక్రియ ముందుకు సాగడం చాలా అవసరం'' అని జైశంకర్‌ పేర్కొన్నారు. ''సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగిస్తున్నాం. చైనా భూభాగం గుండా కైలాస పర్వతం, మానసరోవర్‌ యాత్రలకు పచ్చజెండా ఊపాం. ఇరుదేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం. పరస్పర ప్రయోజనాలకు ఇవి దోహదపడతాయి. తద్వారా ఆసియాతోపాటు ప్రపంచానికి స్థిరత్వాన్ని అందించవచ్చు'' అని వాంగ్‌ యీ పేర్కొన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌తోనూ ఆయన భేటీ కానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)