దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఒరాకిల్ తొలగించింది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది ఈ నిర్ణయం వల్ల ప్రభావితులయ్యారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఓపెన్ ఏఐ చీఫ్ సమావేశం తర్వాత ఈ తొలగింపులు చోటు చేసుకోవడం.. పలు ఊహాగానాలకు దారి తీసింది. ఒరాకిల్‌కు ఎప్పటినుంచో వ్యూహాత్మకంగా మానవ వనరుగా ఉంటోంది.. భారత్. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పుడు సుమారు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవడం చర్చనీయాంశమైంది. జియో-ఎక్స్‌పాన్షన్ ప్రోగ్రామ్ కింద జైపూర్, భోపాల్, చండీగఢ్, తిరువనంతపురం వంటి టయర్-2, టయర్-3 నగరాల్లోకి కూడా ఒరాకిల్ విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాల్సి రావడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. డేటా సెంటర్ డైనమిక్స్ రిపోర్ట్ ప్రకారం- సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సర్వీసెస్, కస్టమర్ సపోర్ట్ డివిజన్లల్లో పనిచేసే ఉద్యోగులు ఈ తాజా లేఆఫ్స్ వల్ల ప్రభావితమయ్యారు. ఎటువంటి ముందస్తు సమాచారం గానీ, అంతర్గతంగా సర్కులర్లు గానీ లేకుండా ఆకస్మికంగా ఈ నిర్ణయం వెలువడినట్లు డేటా సెంటర్ డైనమిక్స్ తెలిపింది. తొలగింపునకు గురైన వారికి పరిహారం చెల్లింపులు, భవిష్యత్ నియామకాలపై స్పష్టత లేదని సమాచారం. లేఆఫ్స్ ప్రకటన వెలువడటానికి కొన్ని రోజుల ముందు- ఒరాకిల్ సీఈఓ లారీ విల్సన్, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వైట్ హైస్ లోని ఓవల్ ఆఫీసులో ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ చర్చల్లో దేశీయ నియామకాలు, నేషనల్ డేటా సెక్యూరిటీ, సాంకేతిక భాగస్వామ్యాలు.. ప్రధాన అజెండాగా ఉన్నాయని సమాచారం. ఆ తర్వాత ఓపెన్‌ఏఐతో ఓ కీలక ఒప్పందాన్ని ఒరాకిల్ ప్రకటించింది. అమెరికన్ కంపెనీలు భారత్ సహా విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందని, హెచ్-1బీ వీసాలనూ పరిమితం చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనల మేరకు ఈ తాజా నిర్ణయం వెలువడిందని, ఎక్కువమంది ఉద్యోగులను అమెరికా నుంచే తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ ఉద్యోగ కోతలతో భారత్ ఎక్కువగా ప్రభావితమైంది. 10 శాతం మంది లేఆఫ్స్ బారిన పడాల్సొచ్చింది. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి తొలగింపులు చోటు చేసుకున్నాయి. అమెరికా, కెనడా, మెక్సికోలలోని ఒరాకిల్ ఉద్యోగులను కూడా తొలగించినట్లు డైనమిక్స్ రిపోర్ట్ వెల్లడించింది.
దేశంలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్
August 19, 2025
0
Tags