గాజాలో చిన్నారులు ఆకలి చావులు !

Telugu Lo Computer
0


గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. ఏడిస్తే కన్నీరు కూడా రాని పరిస్థితి నెలకొంది. తిండిలేక అల్లాడుతున్న చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్న ద్రుశ్యాలు చూస్తే మనస్సు కలుక్కుమంటోంది. పోషకాహార లోపంతో నిత్యం వేలాది మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఆహారం, ఔషధాలు లేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ఇలా గడిచిన నాలుగు రోజులుగా గాజాలో ఎంతో మంది చిన్నారులు ఆకలికి బలయ్యారు. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫా మెడికల్ కాంప్లెక్స్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అబూ సాల్మియా మాట్లాడుతూ గత మూడు రోజుల్లో పోషకాహార లోపం ఆకలి కారణంగా 21 మంది పిల్లలు మరణించారని తెలిపారు. ఆకలితో బాధపడుతూ ఎంతో మంది రోగులు, చిన్నారులు గాజా ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో గాజాలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. నిత్యం రెండు వందల నుంచి 3వందల మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ విపత్తు చూస్తుంటే నోటి నుంచి మాటలు రావడం లేదు. శరీరం బక్కచిక్కి ఎముకలే మాత్రమే కనిపిస్తున్నాయి. పిల్లలు నడవడం, కనీసం ఏడవడానికి కూడా వారిలో ఓపిక లేకుండా పోయింది.వారి పొత్తికడుపులు ముడుచుకున్నాయి. వీరికి అందించేందుకు పోషకాహారం లేదు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నప్పటికీ కొందరి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరోటి ఉండదు. మేము కూడా అలసిపోయాం అంటూ అల్ షిఫామెడికల్ కాంప్లెక్స్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అబూ సాల్మియా తెలిపారు. గాజాలో పరిస్థితిని "భయానక ప్రదర్శన"గా అభివర్ణించిన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్, ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా అక్కడ మరణాలు, విధ్వంసం చోటు చేసుకున్నాయని అన్నారు. మానవతా పరిస్థితి వేగంగా అదుపు తప్పుతోందని ఆయన హెచ్చరించారు. మార్చి 2024లో ఆరు వారాల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ గాజాపై పూర్తి దిగ్బంధన విధించింది. మే చివరి వరకు ఎటువంటి మానవతా సహాయం అందలేదు. కొన్ని ట్రక్కులను లోపలికి అనుమతించినా.. కాల్పుల విరమణ సమయంలో నిల్వ చేసిన సామాగ్రి దాదాపు అయిపోయింది. గాజాలోని 2.4 మిలియన్ల మంది ప్రజలు ఆకలి, దాహం, మందుల కొరతతో బాధపడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ సహాయక కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుండి సహాయ సామాగ్రిని సేకరించడానికి ప్రయత్నిస్తున్న 1,000 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం చంపింది. ఈ సంఘటనలు ఎక్కువగా జీహెచ్ఎఫ్ పంపిణీ కేంద్రాల సమీపంలో జరిగాయి. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి నాదవ్ షోషాని ఒక వీడియోను విడుదల చేస్తూ, గాజాలో 950 ట్రక్కులకు సమానమైన సహాయ సామగ్రి ఉందని, ఇప్పుడు దానిని పంపిణీ చేయడం అంతర్జాతీయ సంస్థల బాధ్యత అని అన్నారు. డోనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ విట్‌కాఫ్‌ను మధ్యప్రాచ్యానికి పంపినట్లు అమెరికా తెలియజేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)