చంగూర్‌ బాబాకు విదేశాల నుంచి వందల కోట్ల సొమ్ము జమ !

Telugu Lo Computer
0


క్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్‌ అలియస్‌ చంగూర్‌ బాబా ఆర్థిక నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిమగ్నమైంది. అతడికి సంబంధించిన 30 బ్యాంక్‌ ఖాతాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, మరో 18 ఖాతాలా సమాచారం వెలుగులోకి వచ్చింది. వీటిల్లో దాదాపు రూ.68 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటికి గత మూడు నెలల్లోనే విదేశాల నుంచి రూ.7 కోట్లు బదిలీ అయినట్లు తేలింది. అతడి చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్‌వర్క్‌లో ఈ ఖాతాలు కూడా భాగమని అధికారులు చెబుతున్నారు. జలాలుద్దీన్‌ మతమార్పిడుల రాకెట్‌ను నిర్వహించే క్రమంలో కోడ్‌ భాషను ఉపయోగించేవాడు. తాజాగా యూపీ ఏటీఎస్‌ దీనిని ఛేదించింది. అతడి బృందం లక్ష్యంగా ఎంచుకొన్న మహిళలను 'ప్రాజెక్ట్‌' అని, మతమార్పిడిని 'మిట్టీ పలట్నా' అని, మానసికంగా సదరు మహిళను మభ్యపెట్టడాన్ని 'కాజల్‌ కర్నా' అని, జలాలుద్దీన్‌తో భేటీ ఏర్పాటు చేయడాన్ని 'దీదార్‌' అని వ్యవహరించేవాడు. చంగూర్‌ బాబా ఆర్థిక నెట్‌వర్క్‌ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అతడికి భారత్‌, నేపాల్‌లో 100 వరకు ఖాతాలున్నట్లు భావిస్తున్నారు. గత మూడేళ్లలో అతడికి రూ.500 కోట్ల విదేశీ నిధులు అందగా, వాటాల్లో రూ.300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకోసం నేపాల్‌ సరిహద్దులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. అతడికి ముఖ్యంగా పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే, యూఏఈ నుంచి నిధులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. చంగూర్‌ బాబాకు సంబంధించి బలరామ్‌పుర్‌లోని భారీ విల్లాను ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకుంది. దీనికి కమాండోలను రక్షణగా పెట్టింది. ఇందులో కొన్ని గదులను ఇప్పటికే కూలగొట్టారు. నిన్న ఏటీఎస్‌ బృందం చంగూర్‌బాబాను ఈ ఇంటికి తీసుకొచ్చి 40 నిమిషాలపాటు విచారించారు. కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనం అతడి సన్నిహితురాలు నీతు అలియాస్‌ నస్రీన్‌ పేరిట ఉంది. ఈ భవనంలో దాదాపు 70 గదులు ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటిల్లో 40ని కూలగొట్టారు. ఇక చంగూర్‌బాబా దాదాపు 15 ఏళ్లుగా మతమార్పిడి రాకెట్‌ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని యూపీ ఏడీజీ లా అండ్‌ ఆర్డర్‌ అమితాబ్‌ యష్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)