గృహనిర్బంధం నడుమ గోడ దూకిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

Telugu Lo Computer
0


మ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 'అమర వీరుల దినోత్సవం' సందర్భంగా వారి శ్మశాన వాటిక అయిన 'మజర్ ఎ శుహాదా'కు సోమవారంనాడు తన మద్దతుదారులతో కలిసి వెళ్లారు. నౌహట్టాలోని శ్మశాన వాటిక గోడ దూకి లోపలకు వెళ్లారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒమర్ గోడ దూకుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, శనివారంనాడు తనను గృహనిర్బంధంలో ఉంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని, మళ్లీ తనను అడ్డుకునే అవకాశం ఇవ్వకూడదనే కారణంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఈరోజు కూడా తనను అడ్డుకున్నప్పటికీ వాళ్ల ప్రయత్నాలను భగ్నం చేశానని చెప్పారు. ఆదివారం అర్థరాత్రి తర్వాత ఒమర్ ఇంటి ముందు బంకర్ ఎత్తేశారు. దీంతో సోమవారం ఆయన ఎవరికీ సమచారం ఇవ్వకుండా కారు నడుపుకుంటూ అమరవీరుల శ్మశానానికి చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకోవడం వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ వారు అనుమతించకపోవడంతో అమాంతం గోడదూకి వెళ్లారు. శాంతి భద్రతలకు బాధ్యులని చెప్పుకుంటున్న వారు శనివారంనాడు ఫాతిహాకు హాజరుకాకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని, ప్రతి ఒక్కరినీ ఉదయం నుంచి గృహనిర్బంధంలో ఉంచారని ఒమర్ చెప్పారు. మజర్‌కు వెళ్లాలనుకుంటున్నట్టు తాను సమాచారం ఇవ్వగానే తన ఇంటి వెలుపల పోలీసు బంకర్లు ఏర్పాటు చేశారని, తమను అడ్డుకోవడంపై చట్టబద్ధతను తాను ప్రశ్నించానని చెప్పారు. 'ఇది స్వేచ్ఛాయుత దేశం అని వాళ్లు చెబుతారు. అయితే మమ్మల్ని బానిసలుగా భావిస్తుంటారు. మేము ఎవరికీ బానిసలం కాదు. మేము ఇక్కడి ప్రజలకే బానిసలం' అని అన్నారు. దీనికి ముందు శనివారంనాడు ఒక వీడియోను ఒమర్ అబ్దుల్లా విడుదల చేశారు. ఇది ఫిజికల్ టార్చర్ కాదా? అని ప్రశ్నించారు. 'ఫిజకల్‌గా టార్చర్ చేశారు. ఉక్కు సంకల్పంతో ఉన్నందున నన్ను ఆపలేరు. నేనేమీ చట్టవిరుద్ధంగానో, అక్రమంగానో వ్యవహరించడం లేదు. చట్ట పరిరక్షకులమని చెప్పుకుంటున్న వారు ఏ చట్టం ప్రకారం నన్ను ఫాతిహాకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది' అని ట్వీట్ చేశారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ రాగానే తనను హౌస్ అరెస్టు చేశారని చెబుతూ తన ఇంటి వెలుపల ఉన్న పోలీసులు ఫోటోలను మరో ట్వీట్‌లో ఆయన షేర్ చేశారు. 'ఎన్నిక కాని ప్రభుత్వం ఎన్నికైన ప్రభత్వాన్ని లాకప్‌లో ఉంచింది' అని కామెంట్ చేశారు. కాశ్మీర్ చరిత్రలో జూలై 13న జరిగిన ఘటన కీలకంగా చెబుతారు. 1931 జూలై 13న కాశ్మీర్ రాజా హరిసింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కాశ్మీర్ ఆందోళనకారులను హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపాయి. ఈ ఘటనను పురస్కరించుకుని ఏటా జూలై 13న అమరవీరుల దినం జరుపుతారు. కాగా, అమరవీరుల దినోత్సవం నిర్వహించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యంత్రాంగం జమ్మూకాశ్మీర్ లో ఆంక్షలు విధించింది. అమరవీరుల శ్మశాన వాటికకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)