థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌ను 2025 ఫిబ్రవరిలో మీరా మురాటీ ఏర్పాటు చేశారు. మెటా, మిస్ట్రాల్, ఓపెన్‌ఏఐ వంటి కంపెనీల్లో పని చేసిన 30 మంది పేరు పొందిన ఏఐ నిపుణులను ఆమె నియమించుకుంది. ఈ సంస్థలోని నైపుణ్యం మెటా (ఫేస్‌బుక్) దృష్టిని ఆకర్షించింది. దాంతో అక్కడ పనిచేసే ఏఐ నిపుణులను తనవైపు లాగేసుకునేందుకు మెటా ప్రయత్నించిందని, పది మందికి పైగా ఉద్యోగులకు భారీ ఆఫర్లు ఇచ్చిందని ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ ఏఐ నిపుణులకు 200 మిలియన్ల డాలర్ల నుంచి 500 మిలియన్ల డాలర్ల వరకు మెటా ఆఫర్ చేసింది. ఓ ఉద్యోగికైతే ఏకంగా 1 బిలియన్ డాలర్లు (రూ.8,755 కోట్లు) ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. కొంతమందితో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ నేరుగా సంప్రదింపులు జరిపారట. ఆ థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌ను పెట్టి సంవత్సరం కూడా కాలేదు. దాని నుంచి ఏ ఒక్క ఉత్పత్తి కూడా ఇంతవరకు మార్కెట్‌లోకి విడుదలవలేదు. కానీ ఆ సిబ్బంది మాత్రం మురాటీపై విశ్వాసం ప్రదర్శించారని ఆ కథనం వెల్లడించింది. ఇప్పుడు ఆ సంస్థ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. మీరా మురాటీ అల్బేనియాలోని వ్లోర్ అనే పట్టణంలో జన్మించారు. స్కూలింగ్ అంతా అక్కడే పూర్తి చేసిన ఆమె, పైచదువుల కోసం తన 16వ ఏట కెనడాలోని వాంకోవర్ ఐస్‌ల్యాండ్‌కు వెళ్లిపోయారు. ఆ దేశంలోనే పైచదువులు పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక 2011లో 'గోల్డ్‌మన్ శాక్స్'లో ఇంటర్న్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 'టెస్లా'లో మూడేళ్ల పాటు పనిచేసిన ఆమె, ఈ వ్యవధిలో ఈ సంస్థ అభివృద్ధి చేసిన 'మోడల్ ఎక్స్' ఈ-కారు మోడల్‌కు సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా సేవలందించారు. 'లీప్ మోషన్' అనే వర్చువల్ రియాల్టీ సంస్థలో రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించిన మీరా నిజ జీవితంలోని పలు సంఘటనలకు కృత్రిమ మేధను జోడిస్తూ కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో తాను గడించిన నైపుణ్యాలే కృత్రిమ మేధపై మరింత ఆసక్తి పెరిగేలా చేశాయని ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ మక్కువతోనే 2018లో 'ఓపెన్ ఏఐ' అనే అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలో చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ ఉపాధ్యక్షురాలిగా, 'చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)'గా బాధ్యతలందుకున్నారు. ఒక దశలో 'ఓపెన్ ఏఐ'కి తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2024 చివర్లో ఆ కంపెనీకి గుడ్‌బై చెప్పి, సొంతంగా థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ ఏర్పాటుచేశారు.
థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ ఉద్యోగులకు ఎర వేసిన మెటా ?
July 31, 2025
0
Tags