మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి హంద్రీనీవాకు నీరు విడుదల !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎంచంద్రబాబు పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ''రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ మాది. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్‌ తొలిసారి ఆలోచించారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన ఆశయాలను తెదేపా నెరవేర్చింది. రాయలసీమకు నీరిచ్చాకే చెన్నైకి నీళ్లు ఇస్తానని ఆనాడు ఎన్టీఆర్‌ చెప్పారు. హంద్రీనీవా నీరు 550 కి.మీ ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పీఏబీఆర్‌, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుంది. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేసే మనస్తత్వం నాది. వేరే రాష్ట్రానికి వెళ్తున్న కియాను అనంతపురం తీసుకొచ్చా. 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీళ్లిచ్చిన ఘనత మాది. రాయలసీమ రైతు కుటుంబాల్లో మార్పు రావాలనేదే నా లక్ష్యం. తొలి దశలో 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు వస్తుంది. ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చి ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాష్ట్రానికి పేరు రావాలని, ప్రజల జీవితాలు బాగుపడాలని నిత్యం కోరుకుంటా. రాయలసీమకు రూ.2 వేల కోట్లు కూడా వైకాపా ఖర్చు చేయలేదు. హంద్రీనీవాకు కనీసం రూపాయి ఖర్చుపెట్టారా? అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది మా ప్రభుత్వమే. మా హయాంలోనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గండికోట వచ్చాయి. నదుల అనుసంధానం జరగాలనేది నా జీవిత ఆశయం. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరవు అనే మాటే ఉండదు. ఇప్పుడు రాయలసీమలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామనే ధైర్యం వచ్చింది. శ్రీశైలం నుంచి ఎస్‌ఆర్‌బీసీ, ముచ్చుమర్రి, మల్యాల కాల్వలు వస్తాయి. హంద్రీనీవా నుంచి అనంతపురం, పత్తికొండ, గొల్లపల్లికి మరో కాల్వ వెళ్తుంది. గాలేరు- నగరి నుంచి గండికోట, అవుకు, మైలవరానికి నీళ్లు వస్తాయి. శ్రీశైలం నుంచి ప్రారంభమైన నీరు తిరుపతికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రాజకీయాలు సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. క్లైమోర్‌ మైన్స్‌ కూడా నన్ను ఏమీ చేయలేకపోయాయి. రాయలసీమలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. ఎక్కడికైనా సులువుగా వెళ్లవచ్చు. వైకాపా హయాంలో ఐదేళ్లపాటు ఒక్క గుంత కూడా పూడ్చలేదు. రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ రోడ్లను అందంగా మారుస్తాం. చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకుంటున్నానా? లేదా? గత ప్రభుత్వం పింఛను రూ. వెయ్యికి పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంది. మేం వచ్చాక ఒకేసారి రూ. వెయ్యి పెంచి పింఛను ఇచ్చాం. దివ్యాంగుల పింఛను ఒకేసారి రూ.6 వేలకు పెంచిన ఘనత మాదే. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేశారు. మేం వచ్చాక మళ్లీ 207 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. 21 దేవాలయాల్లో అన్నప్రసాదం ప్రారంభించాం'' అని చంద్రబాబు అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)