ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ లో పనిమనిషి 42 ఏళ్ల యజమానురాలు, ఆమె 14 ఏళ్ల కొడుకును గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ తెలిపిన వివరాల మేరకు 'జూలై 2 రాత్రి 9:43 గంటలకు పోలీస్ స్టేషన్‌కు పీసీఆర్ కాల్ వచ్చింది. తాము లజ్‌పత్ నగర్ లో ఉంటామని, ఎన్ని సార్లు ఫోన్ చేసినా తన భార్య, కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేయడంలేదని 44 ఏళ్ల కుల్దీప్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో హుటాహుటీన పీసీఆర్, ఇంకా దర్యాప్తు అధికారి సదరు అడ్రస్‌కు చేరుకున్నారు. ఆ ఇంటి తలుపులు మూసివేసి ఉండగా, గేటు, మెట్ల దగ్గర రక్తపు మరకలు ఉన్నాయి. ఇంతలో, ఎస్ హెచ్ఓ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. వీరంతా ఇంట్లోకి ప్రవేశించగానే రక్తపు మడుగులో ఒక మహిళ, ఒక అబ్బాయి మృతదేహాలు కనిపించాయి. మృతులు రుచికా సెవానీ, ఆమె కుమారుడు 10వ తరగతి చదువుతున్న క్రిష్‌గా పోలీసులు గుర్తించారు. రుచికా ని బెడ్ రూంలో గొంతుకోసి హతమార్చగా, ఆమె కుమారుడు క్రిష్ ను బాత్ రూంలో గొంతుకోసి నిందితుడు చంపాడు. రుచికా తన భర్తతో కలిసి వస్త్ర దుకాణం నిర్వహిస్తుంది. బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన ముఖేష్ అనే యువకుడు ఆ షాప్ లో సహాయకుడు కమ్ డ్రైవర్‌గా పనిచేస్తూ నమ్మకంగా ఉంటున్నాడు. అయితే, ఉన్నట్టుండి రాత్రి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. తల్లీకొడుకుల్ని హత్యచేసి పరారైపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ముఖేష్‌ను పోలీసులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన పనిమనిషి !
July 03, 2025
0
Tags