ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలోని మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారంనాడు అరెస్టు చేసింది. చైతన్య పుట్టిన రోజునాడే ఈడీ ఈ అరెస్టు చేయడంపై భూపేశ్ బఘేల్ విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో బఘేల్ నివాసంలో శుక్రవారంనాడు మరోసారి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలోనున్న బఘేల్ నివాసానికి అధికారులు ఉదయం చేరుకున్నారు. ఆ నివాసంలో చైతన్య తన తండ్రితో కలిసి ఉంటున్నారు. చైతన్యను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకోవడంతో ఈడీ వాహనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భూపేశ్ బఘేల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019-2022లో ఈ కుంభకోణం జరిగిందని, ఇది రూ.2,160 కోట్ల కుంభకోణమని, ఇందులో చైతన్య బఘేల్ పాత్ర ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు. కాగా, చైతన్య పుట్టినరోజు నాడే ఆయనను అరెస్టు చేయడంపై భూపేశ్ స్పందించారు. 'నా కుమారుడికి పుట్టినరోజు నాడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామిక దేశంలోనూ మోదీ, అమిత్‌షా ఇచ్చినట్టు వంటి బర్త్‌డే గిఫ్ట్ ఇంకెవ్వరూ ఇవ్వరు' అని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్‌షాలు ఈడీ అధికారులను పంపారని, వారి మెప్పుపొందేందుకు అధికారులు దాడులు జరిపారని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని చెప్పారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ సాయంతో బీహార్‌లో ఓటర్లను తొలగిస్తూ ప్రజాసామ్యాన్ని పరిహసిస్తున్నారని, మరోవైపు విపక్ష నేతలను అణిచివేసేందుకు ఈడీ, ఐటీ, సీబీఐ, డీఆర్‌ఐలను ఉసిగొలుతున్నారని ఆరోపించారు. ఇవన్నీ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు.
మద్యం కుంభకోణంలో చైతన్య బఘేల్ అరెస్టు
July 18, 2025
0
Tags