రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకుడు వేగేశ్న ఆనందరాజు మృతిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫౌండేషన్ ద్వారా ఆయన అందించిన సేవలు మరవలేనివన్నారు. దేవాలయాల్లో మౌలికవసతుల కల్పనకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. దేవాలయాల్లో అన్న ప్రసాద సత్రాలు, తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో మంచిపేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆనందరాజు మృతి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఫౌండేషన్ నిర్వహణలో ఆనందరాజు కీలకంగా వ్యవహరిస్తూ దాని ద్వారా దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రూ.కోట్లు వెచ్చించారు. రూ.77 కోట్లతో తిరుమలలో అన్నదాన సత్రం, రూ.27 కోట్లతో నీటిశుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు ఏటా రూ.1.50 కోట్లు ఇస్తున్నారు. శిర్డీలోనూ నీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు. తిరుపతి, ద్వారకా తిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు. ఆయన స్వస్థలమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో ఆరు ఎకరాల స్థలం కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు అందించారు.
వేగేశ్న ఆనందరాజు మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి
July 07, 2025
0
Tags