ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా జూలియస్ బేర్ వార్షిక నివేదిక ప్రకారం సింగపూర్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను సింగపూర్ దక్కించుకోవడం విశేషం. రెండో స్థానంలో ఉన్న హాంగ్‌కాంగ్‌ను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని లండన్ కైవసం చేసుకుంది. హాంగ్‌కాంగ్ మూడో స్థానానికి పరిమితమైంది. నాల్గో స్థానంలో షాంఘై, ఐదో స్థానంలో మొనాకో, అరోవ స్థానంలో జ్యూరిచ్, ఏడో స్థానంలో న్యూయార్క్, ఎనిమిదో స్థానంలో పారిస్, తొమ్మిదో స్థానంలో సావో పౌలో, పదవ స్థానంలో మిలాన్ ఉన్నాయి. కనీసం ఒక మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన వ్యక్తులు కొనుగోలు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులు, వారు అనుభవిస్తున్న విలాసాల ఆధారంగా వారి జీవన వ్యయాన్ని జూలియస్ బేర్ లైఫ్‌స్టైల్ ఇండెక్స్ విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య డేటాను పరిగణనలోకి తీసుకున్నట్లు జూలియస్ బేర్ వెల్లడించింది. సింగపూర్ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉన్నాయి. దీంతో పలువురు అంతర్జాతీయ వ్యాపారులు సింగపూర్ కేంద్రంగానే తమ బిజినెస్‌ను నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా గతంలో వెళ్లిపోయిన వ్యాపారులను కూడా తిరిగి రప్పించేందుకు సింగపూర్ కొన్ని సంస్కరణలు చేపట్టింది. దీంతో అక్కడి జీవన వ్యయం అమాంతం పెరిగిపోయింది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. ఇదే సింగపూర్‌ను అత్యంత ఖరీదైన నగంలో నిలిచేలా చేసిందని రిపోర్టు పేర్కొంది. అంతేకాకుండా స్థానికులు ఎక్కువగా ఆహారం, బూట్లు, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్, విద్యపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు జూలియస్ బేర్ నివేదిక పేర్కొంది. తాజా ఫలితాల ప్రకారం కరోనా మహమ్మారి తీవ్రత సాధారణ స్థితికి వచ్చినప్పటికీ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ధరలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. గతేడాది ఫలితాలతో పోల్చుకుంటే లండన్ మహానగరం ఓ మెట్టు ఎక్కింది. రెండో స్థానంలో ఉన్న హాంగ్‌కాంగ్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. జ్యూరిచ్ సహా ఇతర ఐరోపా నగరాలు కూడా ర్యాంకింగ్స్‌లో మెరుగుపడ్డాయి.
అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్, రెండో స్థానంలో లండన్
July 15, 2025
0
Tags