తమిళనాడులోని శివకాశిలో ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో దట్టమైన పొగ, మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ప్రస్తుతానికి ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు : నలుగురు కార్మికులు సజీవ దహనం
July 01, 2025
0
Tags