అండర్-19 మూడో వన్డేలోఇంగ్లాండ్‌పై భారత్ విజయం

Telugu Lo Computer
0


నార్తాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అండర్-19 వన్డే సిరీస్‌లోని మూడో వన్డేలో  భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లో 86 పరుగులు సాధించి, భారత అండర్-19 జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, రికార్డుస్థాయిలో 9 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 277.41తో వైభవ్ క్రీజులో తుఫాను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అండర్-19 జట్టు 268 పరుగులు చేయగా, భారత్ అండర్-19 జట్టు 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని, అండర్-19 వన్డేలలో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లలో రిషబ్ పంత్ (18 బంతులు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. తన ఇన్నింగ్స్ మొత్తంలో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేసిన వైభవ్, మైదానం నలుమూలలా బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. ముఖ్యంగా 9 సిక్సర్లతో అండర్-19 వన్డేలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మన్‌దీప్ సింగ్ (8 సిక్సర్లు) పేరు మీద ఉంది. వైభవ్ ఔటైన తర్వాత, కనిష్క్ చౌహాన్ (43 నాటౌట్), ఆర్‌ఎస్ అంబరీష్ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ U19 జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)