ఆంధ్రప్రదేశ్ లో 130 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు ప్రభుత్వం డెప్యూట్ చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన జీవో వెలువడింది. ఆ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని దీన్ని విడుదల చేశారు. మొత్తం అమరావతితో పాటు అయిదు జిల్లాల పరిధిలో ఉండే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను ఈ ఇన్నోవేషన్ హబ్ కు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. సెంట్రల్ హబ్ అమరావతి, విశాఖపట్నం, రాజమండ్రి, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎంపిక చేసిన మొత్తం 130 మంది డెప్యుటేషన్ ప్రాతిపదికన ఇన్నోవేషన్ హబ్ కు వెళ్లనున్నారు. అమరావతి సెంట్రల్ హబ్ - 30, విశాఖపట్నం- 20, రాజమండ్రి- 20, ఎన్టీఆర్- 20, తిరుపతి- 20, అనంతపురం- 20 మందిని కేటాయించింది. ఎంబీఏ (ఫైనాన్స్), ఎంకామ్, సీఏ, ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ చేసిన ఉద్యోగులను ఇన్నోవేషన్ హబ్ కు డెప్యూట్ చేస్తారు. వారి విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా ఆయా విభాగాల్లో వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నోవేషన్ సెంటర్ నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దిగ్గజ పారిశ్రామిక సంస్థలు నిధులు సమకూరుస్తాయి. ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, పోటీతత్వం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పౌర సేవలను అందించే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా దీని భాగస్వామ్యం ఉంటుంది. క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో స్టార్టప్ లకు ఈ హబ్ సహకారం అందిస్తుంది. వ్యవసాయం, టెక్స్‌టైల్ ఇన్నోవేషన్, అపెరల్, ఇంధనం, క్లీన్ టెక్, పునరుత్పాదక ఇంధన రంగాలు, లైఫ్ సైన్స్, ఫార్మా అండ్ హెల్త్ రంగాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది
130 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు డెప్యూట్ చేసిన ప్రభుత్వం
July 05, 2025
0
Tags