అహ్మదాబాద్‌ విమాన ప్రమాద దుర్ఘటన : ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలనలో తొలి అడుగు వేడుక వాయిదా

Telugu Lo Computer
0


హ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈరోజు సాయంత్రం తలపెట్టిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి గురువారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా 'సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్‌' పేరుతో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా అమరావతిలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం సాధించింది, రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటోంది, ఏ విజన్‌తో అడుగులు ముందుకు వేయనుందన్న అంశాలు ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమం రూపొందించారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి పునరంకితం అయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సభ్యులు, సచివాలయంలోని కీలక అధికారులను ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమన ప్రమాదం జరగడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)