ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్‌లో వాడిన బంకర్ బస్టర్ బాంబులను కేవలం నతాంజ్, ఫోర్డో అణుకేంద్రాల నిర్మాణాలను దృష్టిలోఉంచుకొనే తయారుచేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్‌హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డాన్ కెయిన్స్ వెల్లడించారు. దాదాపు 15 ఏళ్లుగా ఈ కేంద్రాలపై లభిస్తున్న ఇంటెలిజెన్స్‌ను దృష్టిలోఉంచుకొని వీటిని రూపొందించామన్నారు. ఇరాన్ పర్వతాల్లో రహస్యంగా జరుగుతున్న నిర్మాణ ప్రాజెక్టులను దృష్టిలోపెట్టుకొని అందిన రహస్య సమాచారంతోనే జీబీయూ-57 ఎ/బి తయారైనట్లు డాన్ కెయిన్స్ పేర్కొన్నారు. 2009 ఫోర్డో అణుకేంద్రంపై డిఫెన్స్ థ్రెట్ రెడక్షన్ ఆఫీసర్‌కు బ్రీఫింగ్ ఇచ్చారన్నారు. అతడు తన సహోద్యోగితో కలిసి దాదాపు 15 సంవత్సరాలపాటు దీనిపై నిఘా ఉంచారన్నారు. లోపలికి ఏ పరికరం వస్తోంది, ఏ పరికరం బయటకు వెళుతోందో పరిశీలించినట్లు పేర్కొన్నారు. వారి పరిశోధన అనంతరం ఈ అణుకేంద్రాలను ధ్వంసం చేసే బాంబు అమెరికా వద్ద లేదని తేల్చారని కెయిన్స్ వెల్లడించారు. దీంతో పెంటగాన్ వాటిని విధ్వంసం చేసేందుకు అవసరమైన ఆయుధం, వ్యూహం సిద్ధం చేయడంపై దృష్టిపెట్టిందన్నారు. ఇందుకోసం చాలామంది పీహెచ్‌డీ నిపుణులు పలు రకాల మాక్ ప్రోగ్రామ్స్‌పై పని చేశారన్నారు. అత్యంత రహస్యంగా ఆ అణుకేంద్రాల నమూనాలు, సిమ్యులేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. అమెరికాలోని సూపర్ కంప్యూటర్లను అత్యధిక గంటలు ఈ ఆయుధం తయారీ, వినియోగం కోసం వాడినట్లు పేర్కొన్నారు. బాంబు లోపల పేలుడు పదార్థాలు ప్రత్యేక సమయంలో పేలేటట్లు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇందుకోసం నమూనా నిర్మాణాలపై వందలసార్లు పరీక్షించినట్లు చెప్పారు. సిబ్బంది కూడా అత్యంత కచ్చితత్వంతో దాడి చేసేలా రాటుదేలారన్నారు. ఫోర్డో కేంద్రంలో మూడు సొరంగ మార్గాలున్నాయని కెయిన్స్ వెల్లడించారు. వీటిల్లో ఒకటి ప్రధానమైంది కాగా మిగిలిన రెండు చెరోవైపు వెంటిలేషన్ కోసం నిర్మించారన్నారు. ఇరాన్ తాము దాడి చేస్తామని ఈ షాఫ్ట్‌లపై కాంక్రీట్‌ను వేసిందని చెప్పారు. తమ ఏడు బి-2 స్టెల్త్ విమానాలు 14 బాంబులతో బయల్దేరాయని చెప్పారు. తొలుత ఫోర్డోలో ప్రధానంగా ఉన్న మార్గంపై కాంక్రీట్‌ను తొలగించేందుకు ఒక బాంబును జారవిడిచినట్లు చెప్పారు. తర్వాత అక్కడే మరో నాలుగు వాడామన్నారు. ఇక మిగిలిన రెండు వెంటిలేషన్ సొరంగాలపై ఆరు బంకర్ బస్టర్లను ప్రయోగించినట్లు చెప్పారు. అదనపు జాగ్రత్తగా మరొకటి ప్రయోగించినట్లు చెప్పారు. ఫోర్డోపై 12 బంకరు బస్టర్లు వాడగా.. నతాంజ్‌పై రెండు జారవిడిచామన్నారు. ఈ బాంబుల పేలుళ్లను పైలట్లు ధృవీకరించారన్నారు. అత్యంత శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్‌పై దాడికి ముందు పరీక్షించిన వీడియోలను అమెరికా విడుదల చేసింది. ఈమేరకు పెంటగాన్‌కు సంబంధించిన వీడియోను శ్వేతసౌధం ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్‌లో భాగంగా ఫోర్డో అణుకేంద్రంపై ఏకంగా 12 బంకర్ బస్టర్లను ప్రయోగించింది. ఇక నతాంజ్ అణుకేంద్రంపై రెండు వాడింది. ఈ దాడితో ఆయా కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ, వీటివల్ల తక్కువ నష్టం జరిగిందంటూ పెంటగాన్‌ను ఉటంకిస్తూ అమెరికా పత్రికలు కథనాలు వెలువరించాయి. ఈనేపథ్యంలో రక్షణశాఖ వివరణ ఇస్తూ ఈ వీడియోలను బహిర్గతం చేసింది. ఫోర్డోలోని అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడానికి జీబీయూ-57 ఏ/బీ బాంబులను ప్రయోగించిన అమెరికా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీటికి వేగం, పటిష్ఠ కవచమే ప్రధాన బలాలు. బి-2 బాంబర్‌లను చాలా ఎత్తు నుంచి జారవిడవడం వల్ల.. కిందకి దూసుకెళ్లే క్రమంలో అవి పెను వేగాన్ని అందుకుంటాయి. బాంబుకున్న భారీ బరువు వల్ల.. అది నేలను తాకగానే పెద్దమొత్తంలో గతిశక్తి ఉత్పన్నమై బంకర్లను ఛేదించగలుగుతుంది. ఆ తర్వాత 2,400 కిలోల పేలుడు పదార్థం విస్ఫోటం చెందుతుంది.
సూపర్ కంప్యూటర్లు వాడి ఇరాన్ పైకి బంకర్ బస్టర్లను సిద్ధం చేసిన అమెరికా
June 27, 2025
0
Tags