సముద్ర తీరాన్ని చదును చేస్తున్న రియల్టర్లను అడ్డుకున్న మత్స్యకారులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చీరాల-బాపట్ల సరిహద్దులోని సముద్ర తీరాన్ని రియల్టర్లు చదును చేస్తుండటంతో మత్స్యకారులు అడ్డుకున్నారు. తీర ప్రాంతంలో రిసార్ట్స్‌కు డిమాండ్‌ ఉండటంతో రియల్టర్ల కళ్లు సముద్రతీరంపై పడ్డాయి. ఈ నేపథ్యంలో చీరాల మండలం వాడరేవు, విజయలక్ష్మిపురం గ్రామాల మధ్య ఈపురుపాలెం కాలువ ప్రవహిస్తోంది. చీరాల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు సముద్రంలో కలిసే విధంగా అప్పట్లో కాలువ నిర్మించారు. తుపాను సమయాల్లో ఈ కాలువ ద్వారా సముద్రంలోని బోట్లను తీసుకొచ్చి మత్స్యకారులు సురక్షితంగా ఉంచుతారు. మంగళవారం సముద్ర తీరంలో జేసీబీ, ట్రాక్టర్లతో చదును చేస్తుండగా ఆ పనులను విజయలక్ష్మిపురం మత్స్యకారులు పెద్ద ఎత్తున చేరుకుని అడ్డుకున్నారు. ఈపురుపాలెం కాలువ - సముద్రం కలిసే ప్రాంతాన్ని చదును చేస్తే తుపాన్ల సమయాల్లో తమ పడవలు సురక్షితప్రాంతాలకు ఎలా తీసుకెళ్లాలని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా అక్రమంగా సముద్రతీరాన్ని చదును చేయటం దారుణమన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. బాపట్ల నుంచి వచ్చిన రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)