అమరావతి ఒక అవినీతి గుట్ట : చింతా మోహన్

Telugu Lo Computer
0

విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖకు వచ్చి వెళ్లారని, ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయబోమని ఆయనతో ఒక్క మాట కూడా చెప్పించలేకపోయారని ధ్వజమెత్తారు. కేంద్రానికి మద్దతు ఇస్తూ, ఉక్కు ఫ్యాక్టరీ గురించి ధైర్యంగా అడగలేక పోతున్నారని, ఇది చంద్రబాబు బలహీనతకు నిదర్శనమని చింతా మోహన్ విమర్శించారు. నెలలోపు కేంద్ర క్యాబినెట్ లో బిల్లు పెట్టి ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైజాగ్ ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమని, స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఇందిరా గాంధీయేనని గుర్తు చేశారు. రాజధాని అమరావతిని 23 జిల్లాల ప్రజలు ఇష్టపడట్లేదని చింతా మోహన్ స్పష్టం చేశారు. దీని పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సంతోషంగా లేరని పేర్కొన్నారు. శివరామకృష్ణన్ కమిషన్ దొనకొండలో రాజధాని పెట్టమని సలహా ఇచ్చిందని, అక్కడ రాజధాని పెట్టేందుకు చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు. అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు చెబుతున్నారు. నేను ఇటీవలే అమరావతి వెళ్లి చూశాను. నాకు అక్కడ దేవతలు కనిపించలేదు. అమరావతిలో అరటి చెట్లు, ఎర్ర తుమ్మ చెట్లు, చెరకు కనిపించింది.. అని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. అక్కడ చెయ్యి పెట్టి తవ్వినా నీళ్లు వస్తున్నాయని, అలాంటి చోట 50 అంతస్తుల భవనం కట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 30,000 ఎకరాలను సేకరించిందని, ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలను కావాలని చంద్రబాబు చెబుతున్నారని, దీనిపై మంత్రివర్గం తీర్మానించారని చింతా మోహన్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి బంధువులు, మిత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అమరావతి చుట్టుపక్కల బినామీ పేర్లతో 100, 200 ఎకరాలు భూములు కొన్నారని ఆరోపించారు. అమరావతిని ఒక అవినీతి గుట్టగా చింతా మోహన్ అభివర్ణించారు. అమరావతి అవినీతి రాజధాని అని, 50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి, ఒక్క గుంటూరు జిల్లాలోనే ఖర్చు చేస్తే, అప్పు భారం అన్ని జిల్లాల ప్రజలపై పడుతుందని చెప్పారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని, అన్ని జిల్లాల ప్రజల మనోభావాలను గుర్తించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చింది ఇందిరా గాంధీయేనని చింతా మోహన్ పేర్కొన్నారు. అడిగిన ప్రతి పేదోడికి భూములు ఆమె భూములు పంచి ఇచ్చారని, బ్యాంకులను జాతీయం చేశారని, పాకిస్తాన్ ను రెండు భాగాలుగా చేశారని అన్నారు. నిజానికి ఎమర్జెన్సీ కాలంలో మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని, పత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చాయని వివరించారు. ఎమర్జెన్సీ కంటే, ఇప్పుడు బీజేపీ పాలనలో ప్రశ్నించిన ప్రతి గొంతును అణచివేస్తున్నారని చింతా మోహన్ ధ్వజమెత్తారు. అరెస్టులు చేసి, జైల్లో పెడుతున్నారని, ఎక్కడో అడవుల్లో సద్దన్నం తింటుంటే కాల్చి వేస్తున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)