విజయవాడ నగరంలోని శాతవాహన కాలేజీని రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యక్తులు నేలమట్టం చేశారు. కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్‌తో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా బోయపాటి శ్రీనివాస అప్పారావు తెరపైకి వచ్చారు. కళాశాలలో నిర్మాణాలను అన్నింటినీ బోయపాటి వర్గీయులు కూల్చివేశారు. కళాశాల తమకే చెందుతుందని నిర్మాణాలు కూల్చివేసి కాలేజీని స్వాధీనం చేసుకున్నారు. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రొక్లెయిన్లతో శాతవాహన కాలేజీ భవనాలను కూల్చివేశారు. కూల్చివేతలపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. కూల్చివేతకు ఉపయోగించిన రెండు జేసీబీలను పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీ కూల్చివేతతో అందులో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కూల్చేసిన శిథిలాల కిందే శాతవాహన కాలేజీ విద్యార్ధులకు సంబంధించిన రికార్డులు ఉండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌ను ప్రత్యర్థి వర్గం కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తులపై వివాదలు నెలకొన్న నేపథ్యంలో వారం క్రితం కాలేజ్ ప్రిన్సిపాల్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో శ్రీనివాస్‌ను కిడ్నాపర్లు వదిలేశారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. అయినప్పటికీ ఈ స్థలం తమేదనంటూ కళాశాల బిల్డింగ్‌లను బోయపాటి వర్గం కూల్చివేసింది. కోర్టులో వివాదం కొనసాగుతున్న కాలేజీ నేలమట్టం చేయడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
శాతవాహన కాలేజీ కూల్చివేత !
June 06, 2025
0
Tags