లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన మినీ వ్యాన్‌ : మినీ వ్యాన్‌ లో ఆభరణాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో గురువారం అర్ధరాత్రి ఓ మినీ వ్యాన్ ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీ కొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని  మినీ వ్యాన్ ను పరిశీలించగా ఒక ప్రముఖ బంగారు విక్రయ సంస్థ ఆభరణాలను విజయవాడ నుంచి నెల్లూరుకు తరలిస్తోంది. ఆ వాహనంలో డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీ సూపర్‌వైజర్ ఉన్నారు. ఈ వ్యాన్ ఒంగోలు సమీపంలోని దశరాజుపల్లి రోడ్డు దగ్గరకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. సెక్యూరిటీ సూపర్‌వైజర్ నాగరాజు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యాన్‌లో ఏముందని ఆరా తీస్తే బంగారం ఉందని తెలియడంతో, వాహనాన్ని రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. వెంటనే డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ టి.విజయ్‌కృష్ణ విచారణ చేశారు. అయితే ఆ ఆభరణాలకు సంబంధించిన పత్రాలను సంస్థ ప్రతినిధులు చూపించారు. అప్పుడు పోలీసుల సమక్షంలో ఆ ఆభరణాలు తీసి మరో వాహనంలోకి మార్చి ఒంగోలు నుంచి నెల్లూరుకు తరలించారు. అప్పటి వరకు పోలీసులు ఆ వాహనానికి రక్షణ కల్పించారు. అయితే ఆ వాహనంలోని బంగారం విలువ రూ.8కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రంలో జ్యువెలరీ షాపులుకు సంబంధించి.. ఆ సంస్థలు వారి సొంత వాహనాల్లో బంగారు ఆభరణాలను తరలిస్తుంటారు. ఈ క్రమంలో గతంలో కూడా కొన్ని వాహనాలకు రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే భారీ మొత్తంలో బంగారం ఉండటంతో పోలీసులు కంగారుపడ్డారు. అయితే ఆ సంస్థలు బంగారానికి సంబంధించిన డాక్యుమెంట్లు పోలీసులకు సమర్పించడంతో వాటిని మళ్లీ వారికి అప్పగించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)