ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది నేతన్నలకు లబ్దిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బి.సి., ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1,036 చేనేత సహకార సంఘాలున్నాయని, వాటిలో 89 వేల నేత కార్మికులు ఉన్నారన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతం ఇచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలు కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తుందన్నారు. బ్లీచింగ్ ఛార్జీలు బండిల్‌కు రూ.129 నుంచి రూ.148లకు (15%), డైయింగ్ ఛార్జీలు బండిల్‌కు రూ.362 నుంచి రూ.434లకు (20%), బెడ్‌షీట్ నేత మజూరి రూ.83 నుంచి రూ.100లకు (20%) మరియు టవల్ నేత మజూరి రూ.31 నుంచి రూ.40లకు (30%) పెంచడం జరిగిందని ఆమె తెలిపారు. ఫలితంగా ఒక్కో నేతన్నకు నెలకు అదనంగా రూ.3 వేల ఆదాయం రానున్నదన్నారు. ఈ విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా నేతన్నల సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. దేశంలోను, రాష్ట్రంలోను గ్రామీణ ఉపాధిలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి పెద్ద పీఠ వేయడం జరిగిందన్నారు. అధికారంలోకి రాగానే నేతన్నలకు చేదోడుగా ఉండేందుకై ఎగ్జిబిషన్లు, విక్రయదారులు, కొనుగోలు దారుల సమావేశాలు నిర్వహించడం జరిగిందని, ఆధునిక డిజైన్లపై నేతన్నలకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. అదే విధంగా ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే ఫించను ఇస్తామని ఇచ్చిన హామీని నిలపెట్టుకోవడం జరిగిందని, ప్రతి నెలా రూ.4 వేల చొప్పున దాదాపు 92,274 మంది నేతన్నలకు ఫించను అందజేయడం జరుగుచున్నదన్నారు. నేతన్న మగ్గాలకు ఉచితంగా విద్యుత్ను అందజేయడం జరుగుచున్నదని, మర మగ్గాలకు 500 యూనిట్లు, చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. గృహ నిర్మాణ పథకం క్రింద కూడా నేతన్నలకు రూ.50 వేలు అదనంగా అందజేయడం జరుగుతున్నదన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నేత కార్మికులకు వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలు పెంపు
June 13, 2025
0
Tags