యాప్‌లలో ఆహారం ఆర్డర్ పెట్టిన తర్వాత రద్దయిందని నకిలీ సందేశాలు పంపిస్తున్న నేరగాళ్లు డబ్బు తిరిగి పొందాలంటే (రీఫండ్) బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలంటూ లింకులు పంపిస్తున్నారు. నిజమేనని భావిస్తున్న వినియోగదారులు వాటిపై క్లిక్ చేసి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాట్సప్, ఎస్‌ఎంఎస్ ద్వారా డెలివరీ యాప్‌లకు సంబంధించిన లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తోంది. ఆర్డర్ పెట్టి రద్దు చేసుకున్న తర్వాత రీఫండ్ పేరుతో సైబర్ ముఠాలు డబ్బు కొట్టేస్తున్నాయి. రీఫండ్ కోసం క్లిక్ చేశాక.. నిమిషాల వ్యవధిలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. తాము ఫుడ్ డెలివరీ యాప్ నుంచి మాట్లాడుతున్నామని.. రీఫండ్ కోసం పంపించే లింకు క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. నిజమేనని భావించి క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి. కొన్నిసార్లు తాము పంపించే లింకు క్లిక్ చేశాక రూ.1 పంపిస్తే రీఫండ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెబుతున్నారు. పొరపాటున లింకు క్లిక్ చేస్తే ఫోన్ ఆధీనంలోకి తీసుకుంటున్న నేరగాళ్లు డబ్బు కొట్టేస్తున్నారు. ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లో నగరవాసి ఆహారం ఆర్డర్ పెట్టిన తర్వాత డెలివరీ చేయకుండా నకిలీ లింకులతో రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ-కామర్స్ సంస్థలు, ఫుడ్ డెలివరీ యాప్ వినియోగదారుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి ఎప్పటికప్పుడు చేరుతోంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న మెజార్టీ సంస్థలు డేటా నిర్వహణ బాధ్యతను తృతీయ పక్ష ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. సేవలు అందించేది ఈ సంస్థలే అయినా.. వినియోగదారుల వివరాలు, సాంకేతిక అవసరాల కోసం ఇతర సంస్థల మీద ఆధారపడతాయి. అందుకనే కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ-కామర్స్, ఫుడ్స్ డెలివరీ సేవలకు కచ్చితంగా అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లనే వినియోగించాలి. ఆర్డర్ రద్దు, రీఫండ్ విషయంలో సమస్యలుంటే యాప్‌లోనే ఫిర్యాదు చేయాలి. కొందరు ఫిర్యాదు చేసేందుకు నేరుగా గూగుల్ సంస్థ పేరు టైప్ చేసి కస్టమర్ కేర్‌నంబరు కోసం వెతుకుతారు. ఇలా చేస్తే కచ్చితంగా మోసపోయినట్లే. వాట్సప్‌నకు రాయితీ, బంపర్‌డ్రా పేరుతో వచ్చే ప్రకటనల్ని నమ్మి క్లిక్ చేయొద్దు. ఒకవేళ మోసపోతే 1930 టోల్‌ఫ్రీ లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించాలి.
ఆర్డర్ పెట్టి రద్దు చేసుకున్న తర్వాత రీఫండ్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న సైబర్ ముఠాలు
June 11, 2025
0
Tags