కరుడుగట్టిన హర్యానా దొంగల ముఠా ఓ కారులో సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా దుండగులు వారిని తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దొంగల ముఠా కుప్పం మీదుగా సరిహద్దు దాటుతోందనే సమాచారంతో డీఎస్పీ పార్థసారథి సూచనలతో గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి - పలమనేరు జాతీయ రహదారి తంబిగానిపల్లె చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి 10.30 గంటలకు పలమనేరు నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన స్కార్పియో కారును తనిఖీ కోసం పోలీసులు నిలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు కారును తనిఖీ చేసేందుకు ముందుకు వెళ్లగా అప్రమత్తమైన దొంగలు కారును వెనక్కి పోనిచ్చి కానిస్టేబుళ్లపైకి ఎక్కించేందుకు యత్నించారు. వెంటనే వారు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. వారు దొంగల ముఠాగా నిర్ధారించుకున్న గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్ ఫైరింగ్ ఓపెన్ చేశారు. తన సర్వీసు రివాల్వర్‌తో కారు డ్రైవర్ తొడకు తగిలేలా ఓ రౌండ్ కాల్పులు జరిపారు. దొంగలు వేగంగా కారుతో సహా అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పట్టారు. వాహనం ఆంధ్ర సరిహద్దు దాటక పోవడంతో కుప్పం పురపాలిక పరిధిలోని పలార్లపల్లె, పరమసముద్రం, బేవనపల్లె, వడ్డిపల్లె, కుప్పం గ్రామీణ మండలం గోనుగూరు, వెండుగంపల్లె ప్రాంతాల్లో తనిఖీ చేశారు. ఈ క్రమంలో పరమసముద్రం చెరువు వద్ద నిందితులు కారును వదిలి పారిపోయారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడ్డాడని పోలీసులు చెబుతున్నారు. హర్యానా కు చెందిన దొంగల ముఠాగా అనుమానిస్తునారు. వీరు పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేశారు. కారులో ఐదు మంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించామన్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
కారుతో పోలీసులను తొక్కించే యత్నంచిన హర్యానా దొంగల ముఠా
June 05, 2025
0
Tags