కర్ణాటకలో లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మూడు నెలల చిన్న పాపతో పాటు ఆరుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వాసులుగా గుర్తించారు. ఏపీ నుంచి బెంగళూరు వెళ్తుండగా నగర శివార్లలోని హోస్కోటే తాలూకా, గొట్టిపుర గేట్ వద్ద కోలార్-హోస్కోటే జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు, అదే మార్గంలో వెళ్తున్న ఒక లారీని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హోస్కోటేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటకలో లారీని ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం
June 13, 2025
0
Tags