ఎమర్జెన్సీ దినాన్ని 'సంవిధాన్ హత్యా దివస్'గా పరిగణిస్తున్నాం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

Telugu Lo Computer
0


దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రోజును దేశ ప్రజలతో పాటు తాము కూడా 'సంవిధాన్ హత్యా దివస్'గా పరిగణిస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో నాటి పాలకులు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పూర్తిగా పక్కనపెట్టారని ప్రధాని మోడీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రాథమిక హక్కులను కాలరాశారని, పత్రికా స్వేచ్ఛను దారుణంగా అణచివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, చివరికి సామాన్య పౌరులను కూడా అన్యాయంగా జైళ్లలో నిర్బంధించారని ఆరోపించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నే అరెస్టు చేసినట్లుగా అనిపించిందని మోదీ వ్యాఖ్యానించారు.ఎమర్జెన్సీ నాటి భయానక పరిస్థితులను ఏ భారతీయుడూ అంత తేలికగా మరచిపోలేరని ప్రధాని పునరుద్ఘాటించారు. ఆ దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మొక్కవోని దీక్షతో పోరాటం చేశారని గుర్తుచేశారు. వారి అలుపెరగని పోరాటం వల్లే చివరికి ఎమర్జెన్సీని ఎత్తివేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)