బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియాన్ని నగర శివారు లోకి తరలించే విషయాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం బటయ జరిగిన ఈ సంఘటనలో 11 మంది మృతి చెందడంతో పాటు మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సిద్ధరామయ్య నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియాన్ని శివారు లోకి తరలించాలనుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణక్ష్ం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 'మా ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియాన్ని మరొక ప్రదేశానికి తరలించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. ఇలాంటి దురదృష్టకర ఘటన ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగకూడదు. ఈ సంఘటన వ్యక్తిగతంగా నన్ను కలిచి వేసింది. మా ప్రభుత్వానికి తీవ్ర బాధ కలిగించింది. ఈ ఘటన విషయంలో మా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. మా తరఫున ఎటువంటి పొరపాటు జరగలేదు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై సస్పెన్షన్ విధించాం. తొక్కిసలాట జరిగిన రెండు గంటల తర్వాతే నాకు సమాచారం అందింది. తొక్కిసలాట మధ్యాహ్నం 3:50 గంటలకు జరిగితే, తనకు సాయంత్రం 5:45 గంటలకు నా దృష్టికి వచ్చింది. నాకు విషయం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులను అలర్ట్ చేయడంతో పాటు ఆసుపత్రికి వెళ్లి బాధితులను కలిసాను. విధానసౌధ ముందు నిర్వహించిన విజయోత్సవ వేడుకకు నన్ను ఆహ్వానించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘటనకు మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.'అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
చిన్నస్వామి స్టేడియాన్ని నగర శివారు లోకి తరలించే యోచనలో కర్ణాటక ప్రభుత్వం
June 09, 2025
0
Tags