ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు

Telugu Lo Computer
0


టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనతో పాటు తమ పార్టీ నేతలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అబద్ధాలు, దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు, కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామని అన్నారు. గత కొన్ని నెలలుగా విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు తనపై, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు, వారి అభిప్రాయాలు తనపైన వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించవని చెప్పారు. కానీ పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వల్ల తమ కుటుంబ సభ్యులపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతోందని కేటీఆర్ తెలిపారు. మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు తన శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. దుష్ప్రచారం చేస్తున్న వారిలో ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కలిసికట్టుగా వెనుక ఉండి నడిపిస్తున్న వారితో పాటు, దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)