హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని 'మీ కుమార్తె కెనడాలో నేరంలో చిక్కుకుంది. మేం అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆమెపై థర్డ్‌డిగ్రీ ప్రయోగిస్తాం' అంటూ సైబర్ నేరగాళ్లు బెదిరించారు. వ్యాపారి తెలివిగా వ్యవహరించి, వారి వలలో పడకుండా తప్పించుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సరూర్‌నగర్ గ్రీన్‌పార్క్ కాలనీకి చెందిన వ్యాపారి శ్రీనివాసరెడ్డికి ఈ నెల 19న వాట్సప్ కాల్ వచ్చింది. స్క్రీన్‌పై 'సీబీఐ విక్రమ్' అనే పేరు కన్పించగా, వాట్సప్ డీపీగా తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫొటో ఉండటంతో బాధితుడు ఆందోళనకు గురయ్యారు. కెనడా సైబర్‌క్రైమ్ విభాగం అధికారులుగా తమను తాము పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు 7 నిమిషాల 49 సెకన్లపాటు మాట్లాడారు. 'మీ కూతురు డ్రగ్స్ కేసులో అరెస్టయింది. వెంటనే మేము సూచించిన ఖాతాకు రూ.50 వేలు జమచేస్తే ఆమెను విడుదల చేస్తాం. లేనిపక్షంలో థర్డ్‌డిగ్రీ ప్రయోగిస్తాం' అంటూ హెచ్చరించారు. వెనువెంటనే ఫోన్‌పే నంబరు పంపారు. ఫోన్‌లో మరికొందరి అరుపులు వినపడటాన్ని గుర్తించిన బాధితుడు తన కుమార్తెతో మాట్లాడించాలని డిమాండ్ చేయగా, వారు నిరాకరించారు. డబ్బులిస్తే తప్ప మాట్లాడించబోమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో డబ్బులు బదిలీచేసే ఆలోచనను విరమించుకున్న బాధితుడు వాట్సప్‌కాల్ కట్ చేసి కెనడాలో ఉన్న కుమార్తెకు ఫోన్ చేశారు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ అరెస్టు చేయలేదని కుమార్తె బదులివ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. తేరుకున్న తర్వాత సదరు వాట్సప్ నంబరు పాకిస్థాన్‌కు చెందినదిగా గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.
సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తెలివిగా తప్పించుకున్న హైదరాబాద్ వ్యాపారి
June 26, 2025
0
Tags