కర్ణాటకలోని కొడలికి చెందిన లక్ష్మణ్ రుక్కన్న కటంబలే అనే రైతు.. 1995లో తన తమ్ముడితో కలిసి తమ పొలాన్ని పంచుకున్నారు. అయితే పంపకాల్లో వచ్చిన పొలాలను ఎవరి పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి గ్రామ అకౌంటెంట్ నగేష్ వద్దకు వెళ్లారు. కానీ ఆ పొలాన్ని వారి పేర్ల మీదకు బదిలీ చేయడానికి లంచం ఇవ్వాలని నగేష్ వారిని డిమాండ్ చేశాడు. అతనికి లంచం ఇవ్వడానికి అంగీకరించని రైతు లక్ష్మణ్ రుక్కన్న కటంబలే.. నేరుగా వెళ్లి లోకాయుక్త అధికారులను ఆశ్రయించి.. జరిగిన విషయం మొత్తం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే నగేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు లోకాయుక్త అధికారులు.. లక్ష్మణ్ చేతుల మీదుగా రూ.500 లంచం ఇప్పిస్తూ పట్టుకున్నారు. అయితే ఈ కేసులో సుదీర్ఘ పోరాటం తర్వాత 2006లో బెళగావి స్పెషల్ కోర్టు నగేష్‌ను దోషిగా తేల్చింది. అతనికి ఒక ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ నగేష్ కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించాడు. ఆ తర్వాత 2012లో కర్ణాటక హైకోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ సంచలన తీర్పునిచ్చింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని లోకాయుక్త అధికారులు.. కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన సుప్రీంకోర్టు ఈ కేసులో సంచలన తీర్పును వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు.. బెళగావి స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. నగేష్ దోషి అని తేల్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో నగేష్‌పై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత రైతు లక్ష్మణ్ రుక్కన్న కటంబలేకు న్యాయం జరిగినట్లయింది. అయితే ఇప్పుడు నగేష్ రిటైర్ కాగా.. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
30 ఏళ్ల క్రితం లంచం తీసుకున్న కేసు : రిటైర్ అయిన తర్వాత దోషిగా తేలడంతో జైలుపాలు
June 22, 2025
0
Tags