ఆసియా కప్‌కు భారత్ దూరం ?

Telugu Lo Computer
0


రాబోయే ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్, పురుషుల ఆసియా కప్‌లో ఆడడానికి బీసీసీఐ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్‌లో శ్రీలంకలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్, పురుషుల ఆసియా కప్ 2025 నుంచి తమ జట్లను ఉపసంహరించుకుంటున్నట్లు బీసీసీఐ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధిపతిగా పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఉన్నారనే విషయం తెలిసిందే. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. పాకిస్తాన్ మంత్రి నేతృత్వంలోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్‌లో భారత జట్టు ఆడకూడదుఅని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు నివేదిక పేర్కొంది. "ఈ విషయం దేశ మనోభావాలకు సంబంధించినది. రాబోయే మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ నుంచి వైదొలగుతున్నట్లు ఏసీసీకి మౌఖికంగా తెలియజేశాం. వారి భవిష్యత్ పోటీలలో మా భాగస్వామ్యం కూడా నిలిపివేయబడింది. మేము భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం."అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ ఈ వైఖరితో సెప్టెంబర్‌లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల ఆసియా కప్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ ప్రస్తుతానికి వాయిదా పడవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్ నుంచి వచ్చినందున.. భారత్ లేకుండా ఆసియా కప్ నిర్వహించడం సాధ్యం కాదని బీసీసీఐకి తెలుసునని క్రీడా వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా లాభదాయకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లేకుండా ప్రసారకులు కూడా ఆసియా కప్ నిర్వహించడానికి ఆసక్తి చూపరు. మునుపటి ఆసియా కప్ ఎడిషన్‌ను పాకిస్తాన్ నిర్వహించింది, కానీ బీసిసిఐ తన జట్టును సరిహద్దు దాటి పంపడానికి నిరాకరించడంతో టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారతదేశం ఆడే అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరిగాయి. అదేవిధంగా, ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా హైబ్రిడ్ మోడల్‌ను ఉపయోగించారు, భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)