హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్ !

Telugu Lo Computer
0


హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులలో కొంతమందికి తక్కువ పెన్షన్‌ ఇస్తుండడంపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులోభాగంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ పూర్తిస్థాయిలో సమాన పెన్షన్‌ అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగంలో చేరిన తేదీ, ఇతర విషయాలతో సంబంధం లేకుండా మాజీ న్యాయమూర్తులకు పెన్షన్‌ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు, అన్ని జిల్లాల న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు సమానంగా ఉండాలని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థకు ఉన్న స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి, గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయమూర్తుల జీతాల మాదిరిగానే, పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు కూడా ఒకేరకంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి అభిప్రాయం వ్యక్తంచేశారు. శాశ్వత, అదనపు న్యాయమూర్తుల మధ్య ఎటువంటి తేడాను చూపకూడదని పేర్కొన్నారు. వితంతువులు, ఇతర ఆధారపడిన వారికి గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా అందరు న్యాయమూర్తులకు ఒకేరకంగా అందించాలన్నారు. టెర్మినల్ ప్రయోజనాల కోసం పదవీవిరమణ తర్వాత న్యాయమూర్తుల మధ్య ఎటువంటి వివక్ష చూపినా అది ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు అవుతుందని సీజేఐ పేర్కొన్నారు. అందువల్ల అన్ని హైకోర్టుల న్యాయమూర్తులు వారు ఎప్పుడు ప్రవేశించారనే దానితో సంబంధం లేకుండా పూర్తి పెన్షన్‌ పొందడానికి అర్హులని అన్నారు. ఇకపై అన్ని హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులకు సంవత్సరానికి రూ.15 లక్షల పెన్షన్‌, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకు రూ.13.5 లక్షల పూర్తి పెన్షన్ చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)