టెస్లా సీఈఓ బాధ్యతల నుంచి ఎలాన్‌ మస్క్‌ను తప్పించనున్న కంపెనీ బోర్డు ?

Telugu Lo Computer
0


లాన్‌ మస్క్‌ను టెస్లా సీఈఓ బాధ్యతల నుంచి తప్పించాలని కంపెనీ బోర్డు భావిస్తోంది. కొత్త వ్యక్తి నియామకం కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాలు, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగిన ఎలాన్‌ మస్క్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన 'డోజ్‌' సారథిగా పని చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం శ్రమించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలక పదవి దక్కింది. అయితే ట్రంప్‌ పరిపాలనలో మస్క్‌ అధిక ప్రమేయం ఉందనే వాదనలతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ఫెడరల్‌ ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్‌ చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారని, ఇందులో మస్క్‌ కీలక పాత్ర పోషించారని విమర్శలు వచ్చాయి. రాజకీయాల్లో అధిక జోక్యంతో ఈ కుబేరుడు తన వ్యాపారాలను పట్టించుకోవడం లేదని పెట్టుబడిదారులపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఫలితంగా టెస్లా విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మస్క్‌ను తప్పించి వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని బోర్డు సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో పెద్దఎత్తున నష్టాల్ని మూటగట్టుకుంది. లాభంలో 71 శాతం క్షీణత నమోదు చేసుకుంది. టెస్లా ఆదాయవ్యవహారాలపై నిర్వహించిన సమావేశంలో కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ పరిపాలనకు తాను కేటాయించే సమయాన్ని గణనీయంగా తగ్గించుకుంటానని, తన కంపెనీలు నడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తానని మస్క్‌ తెలిపినట్లు సమాచారం. టెస్లా సంస్థకు వేరొక సీఈఓను నియమించాలని బోర్డు భావిస్తోందని, అందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనాన్ని ఎలాన్‌ మస్క్‌ 'ఎక్స్‌' వేదికగా ఖండించారు. ఆ వార్తలను కొట్టిపారేశారు. తప్పుడు కథనాలు ప్రచురిస్తూ.. పత్రిక విలువల ఉల్లంఘనలకు పాల్పడుతోందని సోషల్‌మీడియా వేదికగా మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)