ప్రభాకర్‌రావుకు తాత్కాలిక ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Telugu Lo Computer
0


తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంలో పిటిషన్‌ వేయగా ఈరోజు విచారణ జరిగింది. ప్రభాకర్ రావుకు తాత్కాలిక ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. అలాగే ఇండియా వచ్చేందుకు పాస్ పోర్ట్‌ను కూడా సుప్రీం ధర్మాసనం మంజూరు చేసింది. మూడు రోజుల్లో ఇండియా రావాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావుకు న్యాయస్థానం ఆదేశించింది. మూడు రోజుల్లో ఇండియా వచ్చి దర్యాప్తునకు సహకరిస్తా అని వెంటనే అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ గతంలోనే తెలంగాణ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే ఇండియాకు తిరిగి వస్తానని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో మే 9న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ప్రభాకర్ రావు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానని పిటిషన్‌లో వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారించిన సుప్రీం ధర్మాసనం.. ప్రభాకర్‌ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు వెంటనే ఇండియాకు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)