ఉగ్ర దాడికి ముందు పహల్గాంను సందర్శించిన జ్యోతి మల్హోత్రా

Telugu Lo Computer
0


ర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు అక్కడ వీడియోలు తీసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆ వీడియోలను పాకిస్తాన్‌ ఏజెంట్లతో పంచుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్‌ వ్లాగర్‌ జ్యోతి మల్హోత్రాను అధికారులు శనివారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్న న్యూఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ ఉద్యోగి డానిష్‌తో జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి దాదాపు మూడు నెలల ముందు ఆమె తరచూ జమ్ము కశ్మీర్‌లో పర్యటించినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఒకసారి చైనాకు కూడా వెళ్లొచ్చినట్లు తేలింది. 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు అధికారులు నిర్ధరించారు. జ్యోతి మల్హోత్రాని అతడు ట్రాప్‌ చేసినట్లు గుర్తించారు. 'ట్రావెల్‌ విత్‌ జో' పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను జ్యోతి మల్హోత్రా నడుపుతోంది. కమిషన్‌ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి 2023లో పాక్‌ను సందర్శించింది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్‌ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మన దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌తో పంచుకున్నట్లు తేలింది. ఓ పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా తేలింది. అతడితో ఆమె అంతర్జాతీయ ట్రిప్‌కు కూడా వెళ్లింది. ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 152 సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇక దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు జ్యోతి రాతపూర్వకంగా అంగీకరించినట్లు సమాచారం. జ్యోతితోపాటు మరో ఐదుగురి గుట్టును కూడా అధికారులు బయటపెట్టారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)