సనా ఎయిర్‌ పోర్టుపై ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు దాడులు

Telugu Lo Computer
0


యెమెన్‌లోని హూతీల రెబల్స్‌ ఆధీనంలోని సనా ఎయిర్‌ పోర్టుపై ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు విరుచుకుపడ్డాయి. అక్కడ ఉన్న విమానాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ ప్రకటించారు. మంగళవారం హూతీ రెబల్స్‌ ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై రెండు క్షిపణులతో దాడులు చేశారు. దీంతో టెల్‌ అవీవ్‌ ప్రతీకార దాడులు చేపట్టింది. ''మా ఎయిర్‌ ఫోర్స్‌ జెట్లు సనా ఎయిర్‌ పోర్టులోని హూతీ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశాయి. వారికి ఉన్న చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేశాయి. ఇది వారికి స్పష్టమైన సందేశంతోపాటు.. మా పాలసీ ఏమాత్రం మారలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ఎవరైతే దాడులు చేస్తారో వారు భారీ మూల్యం చెల్లించాల్సిందే'' అని పేర్కొన్నారు. మరోవైపు హూతీ రెబల్స్‌ ఆధ్వర్యంలో మీడియా సంస్థలు కూడా సనా విమానాశ్రయంపై దాడులను ధ్రువీకరించాయి. ఈ ఏడాది మే నెలలో హూతీ రెబల్స్‌ ప్రయోగించిన క్షిపణులు బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పడ్డాయి. దీంతో నాడు కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. యెమెన్‌లోని హూతీ రెబల్స్‌ పాలస్తీనాలోని హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ బృందం ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకోవడంతో.. అమెరికా సంకీర్ణ దళాలు కూడా యెమెన్‌ను లక్ష్యంగా చేసుకొన్నాయి. గత నెల చివర్లో ఆఫ్రికా నుంచి వచ్చిన అక్రమ వలసదారులతో నిండిన యెమెన్‌ కారాగారంపై అమెరికా జరిపిన దాడిలో 68 మంది మరణించారని, మరో 47 మంది గాయపడ్డారని హూతీ తిరుగుబాటుదారులు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)