సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో వులర్ సరస్సుపై గతంలో తలపెట్టిన 'తుల్‌బుల్' నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది.అయితే, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంతో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు. దీంతో శుక్రవారంనాడు ఈ ఇద్దరు నేతల మధ్య సోషల్ మీడియా 'ఎక్స్'లో మాటల యుద్ధం చోటుచేసుకుంది. అత్యంత అవసరమైన, జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అవమానవీయమని ఒమర్‌ను మెహబూబా ముఫ్తీ విమర్శించగా, సరిహద్దుకు అవతల ఉన్నవారి కోసం ఆలోచిస్తూ చీప్ పబ్లిసిటీకి ముఫ్తీ ప్రయత్నిస్తున్నారని ఒమర్ తప్పుపట్టారు. ''ఉత్తర కశ్మీర్‌లో ఉలర్ సరస్సు ఉంది. వీడియోలో చూస్తున్న సివిల్ వర్క్‌లు తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినవి. ఈ పనులు 1980లో మొదలయ్యాయి. సింధూ జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ తెచ్చిన ఒత్తిడితో దానిని నిలిపివేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్ కోసం జీలంను ఉపయోగించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. దిగువన ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి మెరుగుపడుతుంది'' అని ఒక ట్వీట్‌లో ఒమర్ తెలిపారు. కాగా, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయాన్ని మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. ''భారత్-పాక్ మధ్య ఉద్రిత్తల నేపథ్యంలో తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామంటూ సీఎం చెప్పడం దురదృష్టకరం. జమ్మూకశ్మీర్‌లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయి తీవ్ర నష్టంతో కడగండ్ల పాలైన పరిస్థితిలో సీఎం వ్యాఖ్యలు ప్రమాదకరంగా, ఉగ్రికత్తలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. అత్యంత అవసరమైన, జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయం. ద్వైపాక్షిక అంశాలను అంతర్జాతీయంగా మార్చే ప్రమాదం కూడా ఉంది'' అని ముఫ్తీ ట్వీట్ చేశారు. పీడీపీ చీఫ్ ట్వీట్‌పై ఒమర్ తిరిగి స్పందించారు. ''సింధూ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీని)తో జమ్మూకశ్మీర్‌కు చారిత్రక ద్రోహం జరిగింది. ఇది జమ్మూకశ్మీర్ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధం. ఈ ఒప్పందాన్ని నేను మొదట్నించీ వ్యతిరేకిస్తున్నాను. ఇక ముందు కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తాం. అయితే, దీనిని ఒప్పుకునేందుకు మీరు (మెహబూబా) సిద్ధంగా లేరు, సరిహద్దుకు ఆవల ఉన్నవారి ప్రయోజనాల కోసం చౌకబారు పబ్లిసిటీ ప్రయత్నంలో ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం'' అని ఒమర్ రీట్వీట్ చేశారు. ఒమర్ వ్యాఖ్యలపై మెహబూబా వెంటనే స్పందించారు. ఎవరిని ఎవరు బుజ్జగించే పని చేస్తున్నారో కాలమే చెబుతుందన్నారు. తాము అంకితభావంతో ఉన్నామని, ఇది నిరూపించుకోవడానికి ఉద్రిక్తతలు సృష్టించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని మెహబూబా రీట్వీట్ చేశారు.
తుల్‌బుల్ నేవిగేషన్ ప్రాజెక్టుపై ఒమర్, మెహబూబా 'ఎక్స్'లో మాటల యుద్ధం
May 16, 2025
0
Tags