మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్‌లో ఓ పవర్ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. దీనికి సంబంధించి గతంలో ఆయన నివాసాల్లో సోదాలు జరిపిన సీబీఐ తాజాగా ఆయనతోపాటు మరో ఐదుగురి పేర్లను ఛార్జిషీటులో పేర్కొంది. కిష్త్వార్‌లో రూ.2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌ టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో 2022లో మాలిక్‌తోపాటు మరో ఐదుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా మాలిక్‌, ఆయన సహాయకులకు సంబంధించి 30 చోట్ల గతేడాది ఫిబ్రవరిలో సోదాలు చేసింది. అనంతరం ఐదుగంటలపాటు విచారించింది. ఈ కేసులో చినాబ్‌ వ్యాలీ పవర్‌ ప్రాజెక్టు మాజీ ఛైర్మన్‌ నవీన్‌ కుమార్‌ చౌధరి సహా అనేక మంది అధికారులు ఉన్నారు. ఆగస్టు 23, 2018 నుంచి అక్టోబర్‌ 30, 2019 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ పనిచేశారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు ముట్టచెబుతామంటూ కొందరు తన కార్యదర్శులను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో పవర్‌ ప్రాజెక్టుదని తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయితే, ఈ కేసులో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను సత్యపాల్‌ మాలిక్‌ అప్పట్లో ఖండించారు. అవినీతిపై తాను ఫిర్యాదు చేసినవారిపై కాకుండా తన నివాసాలపై సోదాలు జరపడాన్ని ప్రశ్నించారు. తాను రైతు కుమారుడనని, ఎవ్వరికీ తలవంచే ప్రసక్తే లేదన్నారు. తాజాగా ఈ కేసులో ఛార్జిషీటు దాఖలు చేయడంపై 'ఎక్స్‌' వేదికగా స్పందించిన ఆయన.. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని, ఎవరితో మాట్లాడే పరిస్థితిలో లేనన్నారు. అనేకమంది శ్రేయోభిలాషుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, వాళ్లతో మాట్లాడలేకపోతున్నాని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)