182 బెటాలియన్‌కు చెందిన పీకే సాహు అనే జవాను దాదాపు వారం క్రితం పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ వద్ద పొరబాటున సరిహద్దు దాటాడు. దీంతో అతడిని పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకొన్నారు. అతడిని విడుదల చేయించేందుకు బీఎస్ఎఫ్ అధికారులు - పాకిస్తాన్ రేంజర్ల మధ్య దాదాపు వారం రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ''ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు'' అంటూ వారు తరచూ చర్చలను ముగిస్తున్నారు. ప్రతి సమావేశం దాదాపు 15 నిమిషాలపాటు జరుగుతోంది. వీటిల్లో పాకిస్తాన్ రేంజర్లు ఏవో సాకులు చూపెడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు రావాలంటున్నారు. ''మేము ప్రతిరోజూ సమావేశం జరుపుతున్నాం. వారు రోజూ ఒకే మాట చెబుతున్నారు'' అని ఓ సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి మీడియా సంస్థకు వెల్లడించారు. బుధవారం జరిపిన సమావేశంలో ఇదే విషయాన్ని వారు పునరావృతం చేశారు. సాహు పొరబాటున దాదాపు 2 మీటర్ల మేరకు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాడు. దీంతో ఆ దేశ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. వాస్తవానికి పాకిస్తాన్ సమస్యను పరిష్కరించాలనుకుంటే గంటల్లో అతడిని విడిపించవచ్చు. కానీ, అలా జరగకపోవడంతో పాకిస్తాన్ దురుద్దేశం బయటపడుతుంది. సరిహద్దులు పొరబాటున దాటిన సందర్భాల్లో ఇరు పక్షాలు చర్చలతో పరిష్కరించుకొన్న సందర్భాలు ఉన్నాయి.
పొరబాటున సరిహద్దు దాటిన జవాన్ విడుదలపై చర్చలను సాగదీస్తున్న పాకిస్తాన్
May 01, 2025
0
Tags