తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణీ సంగమంలో సరస్వతి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు స్నానమాచరించారు. అనంతరం సరస్వతి నదికి హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పది అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమైనాయి. ప్రతిరోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతోపాటు కళా, సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. భక్తుల కోసం.. తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు. వీటిని అతి తక్కువ రుసుము చెల్లించిన వీటి సేవలను వినియోగించుకో వచ్చని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. సరస్వతి పుష్కరాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. తాగు నీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రతి రోజు సగటున లక్షన్నర మంది భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది.
సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
May 15, 2025
0
Tags