హైదరాబాద్‌లో రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద ఇప్పటికే దాదాపు రూ.1740 కోట్ల మేర ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రహదారుల అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ తాజాగా రెండు ఫ్లై ఓవర్లు, ఒక అండర్‌పాస్‌ పనుల కోసం టెండర్లు పిలిచింది. ఒకే ప్యాకేజీగా ఈ మూడు పనులకు టెండర్లు ఆహ్వానించింది. అంచనా వ్యయం రూ.368 కోట్లు. జూన్‌ 18న టెండర్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటించారు. దీంతో హైసిటీ పనుల్లో మరో అడుగుపడినట్టయింది. బంజారాహిల్స్‌ ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వద్ద జీవీకే వైపు రెండు లేన్లతో ఫ్లై ఓవర్, టీవీ 9 జంక్షన్‌ వద్ద రెండు లేన్ల అండర్‌పాస్, మూడు లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులకు ఈ టెండర్లు ఆహ్వానించింది. ఎంపికయ్యే ఏజెన్సీయే సర్వే, డిజైన్‌తో సహ మొత్తం పనులు చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే చేయాల్సి ఉంటుంది. ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌వద్ద నిర్మించే ఫ్లై ఓవర్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3 వైపు నుంచి జీవీకే మాల్‌వైపు వెళ్తుంది. 8.5 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఫ్లై ఓవర్‌ క్యారేజ్‌వే 7.5 మీటర్లు ఉండేలా నిర్మించాల్సిందిగా టెండరు నోటిఫికేషన్‌లో పేర్కొంది. టీవీ9 జంక్షన్‌ వద్ద రెండు లేన్లతో ఒక అండర్‌పాస్‌ నిర్మిమస్తారు. ఇది ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ నుంచి శ్రీనగర్‌ కాలనీవైపు వెళ్లే వారికి ఉపకరిస్తుంది. పది మీటర్ల వెడల్పుతో నిర్మించే దీంట్లో క్యారేజ్‌వే 7.5 మీటర్లుగా ఉండనుంది. ఫుట్‌పాత్‌లతోపాటు రెండు లక్షల నీటి సామర్ధ్యంతో భూగర్భ సంప్‌ కూడా ఉంటుంది. టీవీ9 జంక్షన్‌ వద్దే బంజారాహిల్స్‌ ముగ్ధ జంక్షన్‌నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వైపు మూడులేన్లతో మరో ఫ్లై ఓవర్‌ను కూడా నిర్మిస్తారు. ఈ ఫ్లైఓవర్‌ వెడల్పు 12 మీటర్లు కాగా, క్యారేజ్‌వే 11 మీటర్లు. ఈ ప్యాకేజీలోని మూడు పనుల్లోనూ ప్రయాణ మార్గం ఒకేవైపు ఉంటుంది. విరించి హాస్పిటల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ తాజాగా రెండో సారి టెండర్లు పిలిచింది. ఈ పని అంచనా వ్యయం రూ. 150 కోట్లు. జూన్‌ 11 ఈ టెండర్ల దాఖలుకు చివరితేదీగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హై సిటీ కింద వివిధ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రహదారుల అభివృద్ధి, తదితర పనుల కోసం రూ. 5,942 కోట్ల పనులకు గత డిసెంబర్‌లో పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఐదు ప్యాకేజీల్లో 32 పనుల్ని 23 ప్రాజెక్టుల కింద టెండర్లు పిలిచేందుకు జీహెచ్‌ఎంసీకి అనుమతినిచ్చింది. రద్దీ ఎక్కువ ఉండే ఈ ప్రాంతాల్లో పనులు త్వరితంగా పూర్తయ్యేందుకు స్టీల్‌ ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)