హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన నిర్మాతల సమావేశం ముగిసింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చలు జరిపారు. ఈ నెల 23న మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్తంగా సమావేశం కావాలని నిర్మాతలు నిర్ణయించారు. అప్పుడే తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పర్సంటేజీ విధానంపై కొందరు నిర్మాతలు మొగ్గు చూపగా, కొందరు అనాసక్తి కనబరిచారు. నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, నాగవంశీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శిస్తుండడంతో తమకు ఆదాయం సరిపోవడం లేదని, మల్టీప్లెక్స్ తరహాలోనే వసూళ్లలో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. మల్టీప్లెక్స్‌ల్లో పర్సెంటేజీల ప్రకారం ప్రదర్శనలు జరుగుతుండగా, తాము మాత్రం అద్దె ప్రాతిపదికన ఎందుకు సినిమాల్ని ప్రదర్శించాలని పలువురు యజమానులు తమ వాదనను ఇటీవల జరిగిన సమావేశంలో వినిపించారు.
థియేటర్ల బంద్ తుది నిర్ణయం 23న ప్రకటిస్తాం !
May 21, 2025
0
Tags