వాల్‌మార్ట్ కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 1500 మంది ఉద్యోగులను, ముఖ్యంగా టెక్నాలజీ విభాగానికి చెందిన వారిని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం హెచ్-1బీ వీసాలపై కొత్త వివాదానికి దారితీయడంతో పాటు, సంస్థ గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన సురేష్ కుమార్ పై విమర్శలకు కారణమైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే వాల్‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తమ కార్యకలాపాలను తీర్చిదిద్దుకోవాలని, సామర్థ్యాన్ని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ లేఆఫ్‌ల ప్రకటన వెలువడిన తర్వాత, వాల్‌మార్ట్ సీటీఓ సురేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. ఉద్యోగాల కోతకు, కంపెనీ హెచ్-1బీ వీసాలపై విదేశీయులను నియమించుకునే విధానానికి మధ్య సంబంధం ఉందని ఆ పోస్టులో ఆరోపించారు. వాల్‌మార్ట్ ఐటీ విభాగంలో 40 శాతానికి పైగా భారతదేశానికి చెందిన హెచ్-1బీ వీసా హోల్డర్లు ఉండటం యాదృచ్ఛికం కాదని సదరు పోస్టులో పేర్కొన్నారు. ఈ తాజా ఆరోపణలతో అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకోవడానికి అక్కడి కంపెనీలకు అనుమతించే హెచ్-1బీ వీసా కార్యక్రమంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ కార్యక్రమం వల్ల అమెరికన్ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని కొందరు విమర్శిస్తుండగా, కీలక నైపుణ్యాల కొరతను తీర్చడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది దోహదపడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ పరిణామాలపై వాల్‌మార్ట్ స్పందించింది. బ్లూమ్‌బెర్గ్ సమీక్షించిన ఒక మెమోలో, సీటీఓ సురేష్ కుమార్, వాల్‌మార్ట్ యూఎస్ సీఈఓ జాన్ ఫర్నర్ మాట్లాడుతూ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి, సంస్థాగత నిర్మాణాన్ని సులభతరం చేయడానికి ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలిపారు. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఉద్యోగాల కోత తప్ప, హెచ్-1బీ వీసాలపై నియామకాలకు దీనికి ప్రత్యక్ష సంబంధం లేదని వాల్‌మార్ట్ స్పష్టం చేసింది.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1500 మంది ఉద్యోగులను తొలగించిన వాల్‌మార్ట్
May 26, 2025
0
Tags