దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చినప్పటికీ, మదుపర్లు మాత్రం ఆందోళన వీడలేదు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా సుంకాలను విధించడంతో ఏర్పడిన వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్‌ను కుదిపేశాయి. దీంతో వృద్ధి మందగిస్తుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఈ భయాల ముందు తేలిపోయాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ ఉదయం 74,103.83 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, రోజంతా నష్టాలనే చవిచూసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 379.93 పాయింట్లు నష్టపోయి 73,847.15 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. నిఫ్టీ 136.70 పాయింట్లు నష్టపోయి 22,399 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో ప్రధాన మార్కెట్ సూచీలు కూడా నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. వివిధ రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. ఈ రంగాల షేర్లలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు దిగజారాయి. డాలరుతో రూపాయి మారకం విలువ కూడా నేడు బలహీనపడింది. రూపాయి మారకం విలువ 86.69 వద్ద కొనసాగుతోంది.
ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా కుదేలైన స్టాక్ మార్కెట్ సూచీలు
April 09, 2025
0
Tags